నీళ్లివ్వండి మహాప్రభో..! సూర్యాపేటలో ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన జనం.. నేతల సమాధానానికి షాకైన ప్రజలు!

Published on: 29 Apr 2026, 06:49 AM
News Article

హైదరాబాద్ న్యూస్‌టైమ్ (సూర్యాపేట బ్యూరో): "దాహమేస్తోంది.. తాగడానికి గుక్కెడు నీళ్లివ్వండి" అని వేడుకుంటున్నా పాలకులు కనికరించడం లేదు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో తాగునీటి ఎద్దడి ముదిరిపోయింది. నెల రోజులుగా చుక్క నీరు రాక అల్లాడిపోతున్న భాగ్యనగర్ కాలనీ వాసులు చివరకు సహనం కోల్పోయి దంతాలపల్లి రహదారిపై ఖాళీ బిందెలతో భారీ ఆందోళన చేపట్టారు.

రూ.2000 ఇచ్చాం కదా.. ఇంకేం కావాలి?

తమ సమస్యను విన్నవించుకోవడానికి నాయకుల దగ్గరకు వెళ్లిన ప్రజలకు విస్తుపోయే సమాధానం ఎదురైంది. "మీరేమైనా మాకు ఫ్రీగా ఓట్లు వేశారా? ఓటుకు రూ.2000 తీసుకోలేదా? ఇప్పుడు నీళ్ల కోసం వస్తారా?" అని నేతలు ప్రశ్నిస్తుండటంతో కాలనీ వాసులు అవాక్కయ్యారు. అధికారులకు, కౌన్సిలర్లకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదని, కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

అడుగడుగునా లంచాలే..

కేవలం నీటి సమస్యే కాదు, మున్సిపల్ పారిశుధ్య కార్మికుల ఆగడాలు కూడా పెరిగిపోయాయని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు.

  • కాలువ శుభ్రం చేయాలంటే రూ.50 ఇవ్వాలి.
  • ఇంట్లో నుంచి చెత్త తీసుకుపోవాలంటే రూ.100 ఇవ్వాలి. డబ్బులు ఇస్తేనే పని చేస్తామని, లేదంటే మా ఇష్టం అని కార్మికులు తెగేసి చెబుతున్నారని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారీగా ట్రాఫిక్ జామ్:

రోడ్డుపై ఖాళీ బిందెలతో బైఠాయించి నిరసన తెలపడంతో దంతాలపల్లి రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు రంగంలోకి దిగి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా, కలెక్టర్ లేదా మున్సిపల్ కమిషనర్ వచ్చి హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని ప్రజలు భీష్మించుక కూర్చున్నారు.

డబ్బులు ఇచ్చి ఓట్లు కొన్నామనే అహంకారంతో ప్రజల కనీస అవసరాలను పట్టించుకోని నేతల తీరుపై ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.