నేపాల్ ఆకస్మిక వరదలకు అసలు కారణం అదే.. హిమానీనద పతనంతో వణికిపోయిన హిమాలయాలు!

Published on: 28 Aug 2026, 04:33 PM
News Article

కాఠ్మాండూ, ఆగస్ట్ 28, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదలు (Flash Floods) సృష్టించిన భీభత్సం మానవాళిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘోర విపత్తులో ఇప్పటివరకు కనీసం 579 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 2,000 మందికి పైగా ఆచూకీ గల్లంతయ్యారు. ప్రపంచ ప్రసిద్ధ పర్వట ప్రాంతాలు, పర్యాటక స్థావరాలను క్షణాల వ్యవధిలో బురదలో ముంచెత్తిన ఈ విలయం స్థానికులను, పర్యాటకులను కోలుకోలేని దెబ్బతీసింది. త్రిశూలి, భోటే కోషి నదుల వెంబడి ఉప్పొంగిన భారీ వరద ఉధృతికి ఇళ్లు, రోడ్లు, వంతెనలు పేకమేడల మాదిరిగా కొట్టుకుపోయాయి.

ఆకస్మిక వరదలకు అసలు కారణం ఏమిటి? ఈ విపత్తు ప్రారంభమైన కొత్తలో కొందరు భూకంపం కారణంగా కొండచర్యలు విరిగిపడ్డాయని భావించారు. అయితే, యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) మరియు ప్రముఖ భూగర్భ శాస్త్రవేత్తల లోతైన విశ్లేషణ ప్రకారం.. ఈ పూర్తి వినాశనానికి ప్రధాన కారణం 'హిమానీనద పతనం' (Glacial Collapse) అని తేలింది. హిందూ కుష్ హిమాలయ ప్రాంతంలోని లాంగ్టాంగ్ లిరుంగ్ శిఖరం సమీపంలో ఉన్న ఒక భారీ గ్లేసియర్ (హిమానీనదం) దిగువ భాగం ఒక్కసారిగా కుప్పకూలింది.

ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ భూవిజ్ఞాన శాస్త్ర ప్రొఫెసర్ మైక్ సీర్లే మరియు డండీ విశ్వవిద్యాలయ భూవిజ్ఞాన శాస్త్రవేత్త సైమన్ కూక్ అధ్యయనం ప్రకారం.. ఈ భారీ గ్లేసియర్ కూలినప్పుడు దాని ప్రభావం భూమిపై తీవ్ర ప్రకంపనలను సృష్టించింది. ఇది ఏకంగా 5.2 తీవ్రతతో భూకంపం వచ్చినంత శక్తిని విడుదల చేసింది. గ్లేసియర్ పతనం కారణంగా పెద్ద ఎత్తున మంచు, రాళ్లు, భారీ శిథిలాలు లోయలోకి జారిపడి కొండచర్యలుగా విరిగిపడ్డాయి. ఈ భారీ శిథిలాల ప్రవాహం నదికి తాత్కాలికంగా అడ్డుకట్ట వేయడంతో (Landslide Dam) నీరు భారీగా నిల్వ ఉండిపోయింది. ఆ తర్వాత ఆ నీటి ఒత్తిడిని తట్టుకోలేక ఆనకట్ట ఒక్కసారిగా తెరుచుకోవడంతో.. మునుపెన్నడూ లేని విధంగా ఒకేసారి పెను ముసరులా నీరు, బురద ఉప్పొంగి దిగువ ప్రాంతాలపైకి విరుచుకుపడ్డాయి.

గ్లేసియర్ల కరుగుదలకు కారణం వాతావరణ మార్పులే: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు (Global Warming) మరియు వాతావరణ మార్పుల కారణంగా హిమాలయ ప్రాంతాల్లోని గ్లేసియర్లు వేగంగా కరిగిపోతున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్వతాల లోపల ఉండే శాశ్వత మంచు పొరలు (Permafrost) ఉష్ణోగ్రత పెరుగుదల వల్ల బలహీనపడి కరిగిపోవడం వల్లే ఇలాంటి కొండచర్యలు, గ్లేసియర్ పతనాలు సంభవిస్తున్నాయని జియాలజిస్ట్ డానియల్ షుగర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఏర్పడిన సహజ సరస్సులు మళ్లీ ఉప్పొంగే ప్రమాదం ఉందని, మరోసారి సెకండరీ ఫ్లడ్స్ (Secondary Flooding) ముప్పు పొంచివుందని చైనా, నేపాల్ ప్రభుత్వాలు హెచ్చరించాయి. నేపాల్ ప్రధాని బేంద్ర షా ఆదేశాల మేరకు సుమారు 1,200 మంది రెస్క్యూ సిబ్బందితో సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ, ప్రతికూల వాతావరణం, భారీ వర్షాల కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌కు తీవ్ర అడ్డంకులు ఏర్పడుతున్నాయి.