న్యూఢిల్లీ, నవంబర్ 6, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): దేశ అత్యున్నత చట్టసభల్లో ప్రజాప్రతినిధుల అర్హత, వారిపై ఉన్న క్రిమినల్ కేసుల తీరుతెన్నులపై ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్’ (ADR) సంస్థ మరోసారి సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న సిట్టింగ్ ఎంపీలు మరియు ఎమ్మెల్యేల ఎన్నికల అఫిడవిట్లను విశ్లేషించి తాజా నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం.. మహిళలపై అఘాయిత్యాలు, నేరాలకు సంబంధించిన కేసులను ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు స్పష్టమైంది. దేశవ్యాప్తంగా మొత్తం 772 మంది సిట్టింగ్ ఎంపీలు, 4,109 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల అఫిడవిట్లను విశ్లేషించగా.. వీరిలో 187 మంది ప్రజాప్రతినిధులపై మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు నమోదై ఉన్నట్లు తేలింది. ఈ జాబితాలో 19 మంది పార్లమెంటు సభ్యులు (ఎంపీలు), 168 మంది శాసనసభ్యులు (ఎమ్మెల్యేలు) ఉన్నారు.
పార్టీల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా భారతీయ జనతా పార్టీ (BJP) తరఫున 106 మంది ఎంపీలు/ఎమ్మెల్యేలపై ఈ కేసులు ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ (INC) పార్టీకి చెందిన 20 మంది, తెలుగుదేశం పార్టీ (TDP)కి చెందిన 18 మంది ఉన్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే.. వెస్ట్ బెంగాల్‌లో అత్యధికంగా 69 మంది ప్రజాప్రతినిధులపై ఈ కేసులు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 22 మంది, ఒడిశాలో 17 మంది ఈ జాబితాలో నిలిచారు. అత్యంత విచారకరమైన విషయమేమిటంటే.. మహిళలపై అఘాయిత్యాల కేసులు ఎదుర్కొంటున్న వారిలో నేరుగా రేప్ (అత్యాచారం) వంటి అత్యంత హేయమైన కేసులు ఎదుర్కొంటున్న వారు ఏకంగా 14 మంది (2 లోక్‌సభ ఎంపీలు, 12 మంది ఎమ్మెల్యేలు) ఉన్నట్లు ADR నివేదిక నిగ్గుతేల్చింది. నేరచరితులు, ముఖ్యంగా మహిళలపై తీవ్రమైన కేసులున్న వ్యక్తులు చట్టసభల్లోకి అడుగుపెట్టడం ప్రజాస్వామ్య వ్యవస్థకు, మహిళా రక్షణకు పెనుముప్పని ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల విషయంలో రాజకీయ పార్టీలు కఠినమైన నైతిక విలువలను పాటించాలని, తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న వారికి టికెట్లు కేటాయించకుండా చట్టపరమైన సంస్కరణలు తేవాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు