చౌటుప్పల్, యాదాద్రి భువనగిరి, నవంబర్ 6, 2026 (హైదరాబాద్ న్యూస్టైమ్): యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్ మరియు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం దివిస్ లేబరేటరీస్ సంస్థ సహకారంతో ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంపును గ్రామ సర్పంచ్ బోయ కాకి శ్రీలత సుందర్ రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీలత సుందర్ మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద ఈ ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసిన దివిస్ లేబరేటరీస్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే చదువులో రాణించగలరని, అందుకే ఇలాంటి వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ క్యాంపులో విద్యార్థులకు జనరల్ హెల్త్ చెక్అప్ నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు, మందులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో దివిస్ లేబరేటరీస్ యాజమాన్య ప్రతినిధులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.