పని ఒత్తిడి తట్టుకోలేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కీర్తన ఆత్మహత్య..
హైదరాబాద్ న్యూస్‌టైమ్, వరంగల్: ఐటీ రంగంలో పెరుగుతున్న పని ఒత్తిడి మరో నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వరంగల్ నగరంలోని కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన కీర్తన (25) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మానసిక ఒత్తిడిని తట్టుకోలేక తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కీర్తన దేశ రాజధాని ఢిల్లీలోని ఒక ప్రముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది; అయితే కంపెనీలో పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోవడంతో ఆమె తీవ్ర మానసిక ఆందోళనకు (డిప్రెషన్) గురైంది. ఆమె మానసిక ఆరోగ్యం దెబ్బతినడాన్ని గమనించిన తల్లిదండ్రులు మూడు నెలల క్రితమే ఆమెను ఉద్యోగం నుండి ఇంటికి పిలిపించుకున్నారు. గత కొంతకాలంగా వరంగల్‌లోనే ఒక మానసిక వైద్యుడి (సైకియాట్రిస్ట్) వద్ద ఆమెకు చికిత్స కూడా అందిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయాన్ని చూసి కీర్తన తీవ్ర మనస్తాపంతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.