పనికిరాని ప్లాస్టిక్‌తో రుచికరమైన బిస్కెట్లు.. శాస్త్రవేత్తల సంచలన ప్రయోగం!
న్యూఢిల్లీ, ఆగస్ట్ 24, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): ప్రపంచాన్ని వణికిస్తున్న ప్లాస్టిక్ కాలుష్యానికి, ఆహార కొరతకు చెక్ పెట్టేలా శాస్త్రవేత్తలు ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. పనికిరాని ప్లాస్టిక్ సీసాలు మరియు వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించి తినదగిన, వెనిల్లా ఫ్లేవర్ కుకీలను తయారు చేయవచ్చని పరిశోధకులు నిరూపించారు. అమెరికాలోని సదరన్ ఇల్లినాయిస్ యూనివర్శిటీ కార్బొండేల్ (SIU Carbondale) పరిశోధకులు ఈ అద్భుత ప్రయోగానికి రూపకల్పన చేశారు. ఈ ప్రక్రియలో భాగంగా.. సూపర్‌మార్కెట్ల నుంచి సేకరించిన వాడిన ప్లాస్టిక్ సీసాలు, మొక్కజొన్న వ్యర్థాలను 'ఆక్సిడేటివ్ హైడ్రోథర్మల్ డిసొల్యూషన్' అనే పద్ధతి ద్వారా సూక్ష్మజీవులు జీర్ణించుకోగల పదార్థాలుగా మారుస్తారు. అనంతరం జన్యుపరంగా మార్పులు చేసిన ఈస్ట్ (yeast) సహాయంతో వీటిని వెనిల్లా రుచి గల తినుబండారాలుగా లేదా కుకీలుగా తయారు చేయవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ఆహారంగా మార్చడం ద్వారా పర్యావరణ సమస్యలను అధిగమించవచ్చని భావిస్తున్నప్పటికీ, దీని భద్రతపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ కుకీలను రుచి చూసేందుకు పరిశోధకులు సంస్థాగత అనుమతుల కోసం ఎదురుచూస్తున్నారు.