పర్మినెంట్ చేస్తామని నమ్మించి మోసం చేశారు: రేవంత్ సర్కార్‌పై మండిపడ్డ కాంట్రాక్ట్ ఉద్యోగులు

Published on: 23 Jun 2026, 11:19 AM
News Article

హైదరాబాద్, జూన్ 23 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): గత నాలుగు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ జీతాల చెల్లింపులు, ఉద్యోగాల క్రమబద్ధీకరణ డిమాండ్‌తో వారు హైదరాబాద్‌లో భారీ ఎత్తున 'మహాధర్నా' చేపట్టారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. నాలుగు నెలలుగా జీతాలు లేక కుటుంబ పోషణ భారంగా మారిందని, రోజువారీ ఖర్చులకు అప్పులు చేస్తూ, వాటికి ఈఎంఐలు (EMI) కట్టలేక ఆత్మహత్యలు చేసుకునే దుస్థితికి చేరుకున్నామని కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులకు ఇచ్చినట్లే ప్రతి నెలా ఒకటో తేదీనే తమకు కూడా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడు తమను నమ్మించి మోసం చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే తమ బకాయి వేతనాలు చెల్లించి, ఇచ్చిన మాట ప్రకారం క్రమబద్ధీకరణ చేయకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.