పుట్టినరోజునే బలి తీసుకున్న భర్త: భార్యను నడిరోడ్డుపై కాల్చి చంపిన కానిస్టేబుల్!

Published on: 14 Jul 2026, 04:08 AM
News Article

ఢిల్లీ, జూలై 14, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): ఢిల్లీలోని వినోద్ నగర్‌లో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య పుట్టినరోజు వేడుక జరుపుకోవాల్సిన రోజే, ఆమెను భర్త తుపాకీతో కాల్చి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 2023లో మనీష్ భాటి అనే వ్యక్తికి ప్రియాంకతో వివాహం జరిగింది. మనీష్ ఢిల్లీ పోలీసు విభాగంలోని యాంటీ ఆటో థెఫ్ట్ స్క్వాడ్ (AATS)లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ప్రియాంక పుట్టినరోజు కావడంతో, దంపతులిద్దరూ బైక్‌పై బయటకు వెళ్లారు. మార్గమధ్యలో లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రి సమీపంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో బండి దిగి ప్రియాంక వెళ్లిపోతుండగా, కోపోద్రిక్తుడైన మనీష్ తన వద్ద ఉన్న తుపాకీతో ఆమెపై కాల్పులు జరిపి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో రోడ్డుపై పడి ఉన్న ప్రియాంకను గమనించిన డెలివరీ బాయ్ వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.ఇంటి నుంచి బయలుదేరడానికి ముందే ఇద్దరి మధ్య గొడవ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. 2024లో కట్నం కోసం మనీష్ తనను వేధించాడని, అప్పట్లో దాదాపు 8 నెలల పాటు ప్రియాంక తన సోదరుడి ఇంట్లోనే ఉందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా, హత్య కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.