పురుగుల మందు తాగి సర్పంచ్ ఆత్మహత్యాయత్నం.. ఆసుపత్రికి తరలిస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి
నిర్మల్: ప్రాణాలు తీసుకోవాలనుకున్న ఆ సర్పంచ్‌ను కాపాడుకునేందుకు కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆత్మహత్యాయత్నం చేసిన ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా విధి మరో రూపంలో పగబట్టింది. మార్గమధ్యంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆ సర్పంచ్ ప్రాణాలను బలిగొంది. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... నిర్మల్ జిల్లా కడెం మండలం మాసాయిపేట గ్రామానికి చెందిన మహిళా సర్పంచ్ లహరిక.. మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆమె పురుగుల మందు తాగిన విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. లహరిక ప్రాణాలను ఎలాగైనా కాపాడుకోవాలనే ఆరాటంతో హుటాహుటిన ఒక కారులో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు బయలుదేరారు.
కాటేసిన ప్రమాదం: ఆసుపత్రికి వేగంగా వెళ్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పింది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రాక్టర్ నాగళ్లను కారు బలంగా ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంతో అప్పటికే విషం ప్రభావంతో అపస్మారక స్థితిలో ఉన్న సర్పంచ్ లహరిక పరిస్థితి మరింతగా విషమించింది. దీంతో ఆసుపత్రికి చేరుకునేలోపే.. మార్గమధ్యంలోనే ఆమె తుదిశ్వాస విడిచారు.
కారణాలు అన్వేషిస్తున్న పోలీసులు: సర్పంచ్ లహరిక ఆత్మహత్యాయత్నానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కుటుంబ కలహాలా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. ఈ విషాద ఘటనతో మాసాయిపేట గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.