హైదరాబాద్, నవంబర్ 26, 2026 (హైదరాబాద్ న్యూస్టైమ్): మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర, ఆశయాల నేపథ్యంలో రూపొందిన 'పూలే' చిత్రం ప్రీ-రిలీజ్ వేడుక గురువారం హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీసీ సంఘం రాష్ట్ర నాయకులు గణం నర్సింహ్మా కురుమ (జీఎన్కే) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర హీరో ప్రతీక్ గాంధీ, నిర్మాత పొన్నం రవిచంద్ర, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, డోలి దెబ్బ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాల్గ యాదయ్య, పర్వతాలు, రాంబాబు తదితర ప్రముఖులతో ఆయన ఆత్మీయంగా సమావేశమయ్యారు.
పూలే ఆశయాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకం: ఈ కార్యక్రమంలో గణం నర్సింహ్మా కురుమ మాట్లాడుతూ.. బహుజనుల విద్యాభివృద్ధి కోసం మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన పోరాటం, సమానత్వం, సామాజిక న్యాయం కోసం సాగించిన ఉద్యమాలు నేటి సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కుల వివక్ష, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పూలే దంపతులు చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలు, బీసీలు, మహిళల విద్యాభివృద్ధికి వారు అందించిన సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని తెలిపారు.
మహనీయుల జీవిత చరిత్రలను ప్రతిబింబించే ఇలాంటి సినిమాలు నేటి యువతలో సామాజిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. 'పూలే' చిత్రం ద్వారా మహాత్ముడి ఆశయాలు మరింత విస్తృతంగా ప్రజల్లోకి చేరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత పొన్నం రవిచంద్ర, హీరో ప్రతీక్ గాంధీతో పాటు చిత్ర యూనిట్ సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.