పెండింగ్ బిల్లులు రాక మరో మాజీ సర్పంచ్ బలవన్మరణం..

Published on: 23 Jun 2026, 11:07 AM
News Article

సిద్దిపేట, జూన్ 23 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెండింగ్ బిల్లుల కోసం ఎదురుచూస్తూ మరో మాజీ సర్పంచ్ బలవన్మరణానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పిట్టల సంపత్, అప్పుల బాధ తాళలేక తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన పదవీకాలంలో గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనుల కోసం సంపత్ సుమారు రూ. 11 లక్షల వరకు అప్పులు చేసి సొంత నిధులు వెచ్చించాడు. అయితే, ఆ పనులకు సంబంధించిన బిల్లుల కోసం అధికారుల చుట్టూ ఎంత తిరిగినా ఫలితం దక్కలేదు. బిల్లులు రాకపోవడం, మరోవైపు తెచ్చిన అప్పులకు వడ్డీలు (మిత్తి) పెరిగిపోతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురైన సంపత్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పదేపదే చెబుతున్నప్పటికీ ఆచరణలో పట్టించుకోవడం లేదని, ఆర్థిక ఇబ్బందులతో సర్పంచులు ఇలా ప్రాణాలు తీసుకుంటున్నారని తోటి మాజీ సర్పంచులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.