పెనమలూరులో పోలీసుల డ్రోన్ ఆపరేషన్, గంజాయి డిటెక్షన్ కిట్లతో తనిఖీలు
హైదరాబాద్ న్యూస్‌టైమ్, పెనమలూరు: కృష్ణా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (S.P) వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు, గన్నవరం ఇంచార్జ్ డీఎస్పీ కే. ధర్మేంద్ర ప్రత్యక్ష పర్యవేక్షణలో పెనమలూరు ఇన్స్పెక్టర్ N. వెంకటనారాయణ ఆధ్వర్యంలో ఎస్ఐలు, స్పెషల్ ఫోర్స్ సిబ్బంది డ్రోన్ కెమెరాలతో కలిసి యనమలకుదురు గ్రామంలోని సంజీవయ్య నగర్, లంబాడి పేట, డబ్బా పంపుల సెంటర్ పరిసరాల్లో గంజాయి నిర్మూలనే ధ్యేయంగా భారీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న పలువురికి అధునాతన 'స్పెషల్ గంజాయి డిటెక్షన్ కిట్ల' ద్వారా అక్కడికక్కడే డ్రగ్స్ పరీక్షలు జరపగా, పాజిటివ్ అని తేలిన వ్యక్తులను ఆధీనంలోకి తీసుకుని గంజాయి సరఫరా ముఠాల మూలాలపై లోతుగా సమాచారం సేకరించారు. గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాల వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం క్షీణించి బంగారు భవిష్యత్తు ఎలా అంధకారమవుతుందో, క్రిమినల్ కేసుల వల్ల ఉద్యోగ అవకాశాలు ఎలా దెబ్బతింటాయో పట్టుబడిన వారికి, అక్కడి యువతకు అధికారులు క్షుణ్ణంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐ వెంకటనారాయణ మాట్లాడుతూ.. గంజాయి రహిత సమాజ స్థాపనకు ప్రజల సహకారం ఎంతో అవసరమని, పరిసరాల్లో ఎక్కడైనా గంజాయి విక్రయాలు లేదా రవాణా జరుగుతుంటే వెంటనే సమాచారం అందించాలని, అలా సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత రహస్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.