పెళ్లి వేడుకల్లో కొత్త ట్రెండ్.. ప్రాణాల మీదకు తెస్తున్న కెమికల్స్!

Published on: 30 May 2026, 04:36 PM
News Article

హైదరాబాద్, మే 30 (హైదరాబాద్ న్యూస్ టైమ్): ఇటీవల కాలంలో పెళ్లి వేడుకలలో ఫొటోలు, ఇన్‌స్టా రీల్స్ మెరుపుల కోసం సహజసిద్ధమైన పద్ధతులను పక్కనబెట్టి రసాయనాలు వాడటం ఒక ఫ్యాషన్‌గా మారింది. అయితే ఈ రసాయనిక పూతలు చర్మ వ్యాధులకే కాకుండా ఏకంగా ప్రాణాలకే ముప్పుగా మారుతున్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో హల్దీ (పసుపు) వేడుకలో కెమికల్స్ కలిసిన కల్తీ పసుపు వాడటం వల్ల 21 ఏళ్ల పెళ్లికూతురు రాఖీ ప్రాణాలు కోల్పోగా, పెళ్లికొడుకు వెంటిలేటర్ పై మరణంతో పోరాడుతున్నాడు. మరో 10 మంది మహిళలు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యారు. మంగళకరంగా జరగాల్సిన పసుపు వేడుక, రసాయనాల వాడకం వల్ల ఒక ఇంటి నిండా తీవ్ర విషాదాన్ని నింపింది. మార్కెట్లో దొరికే రంగు రంగుల పసుపులో లెడ్ క్రోమేట్, మెటానిల్ ఎల్లో వంటి ప్రమాదకరమైన రసాయనాలు, సింథటిక్ రంగులు కలుపుతున్నారు. దీనికి తోడు అనుభవం లేని బ్యూటీ పార్లర్లలో తక్షణ కాంతి (ఇన్‌స్టాంట్ గ్లో) కోసం క్వాలిటీ లేని బ్లీచింగ్ కెమికల్స్, స్టెరాయిడ్స్, సింథటిక్ ప్యాక్‌లు వాడుతున్నారు. చర్మ రంధ్రాల ద్వారా ఇవి రక్తంలోకి, శ్వాసకోశ వ్యవస్థలోకి చేరి క్షణాల్లో అలర్జిక్ షాక్ (Anaphylactic Shock) కి దారితీస్తున్నాయి.

డాక్టర్ల సలహాలు - జాగ్రత్తలు:

 సహజసిద్ధమైన పసుపు: మార్కెట్ ప్యాకెట్లను నమ్మకుండా, పసుపు కొమ్ములను తెచ్చి ఇంట్లోనే ఆడించిన ప్యూర్ పసుపును మాత్రమే వాడాలి.

 బ్యూటీ పార్లర్ల ఎంపిక: తక్కువ ధరని కాకుండా, గుర్తింపు పొందిన బ్యూటీషియన్లను ఎంచుకుని, వారు వాడే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ గురించి ముందే అడిగి తెలుసుకోవాలి.

 ప్యాచ్ టెస్ట్ (Patch Test) తప్పనిసరి: ఎలాంటి కొత్త క్రీములు, పసుపు పూసే ముందైనా చేతి పైన లేదా చెవి వెనుక రాసి 20 నిమిషాల పాటు పరీక్షించాలి.

 తక్షణ ప్రథమ చికిత్స: కెమికల్స్ రాసిన వెంటనే చర్మంపై బొబ్బలు రావడం, ఊపిరి ఆడకపోవడం, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే నీళ్లతో కడిగేసి ఆలస్యం చేయకుండా అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాలి.

రీల్స్ మెరుపుల కంటే పిల్లల ప్రాణాలే ముఖ్యమని, వేడుకల్లో రసాయన పూతలకు దూరంగా ఉంటూ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.