పోలీసులకు లొంగిపోయిన బండి భగీరథ్.. స్వయంగా అప్పగించిన తండ్రి బండి సంజయ్!

Published on: 16 May 2026, 03:12 PM
News Article
  • పోక్సో కేసులో లుకౌట్ నోటీసులు..
  • జారీ అయిన కొద్ది గంటల్లోనే అనూహ్య మలుపు
  • చట్టం ముందు ఎవరైనా ఒకటే,..
  • విచారణకు సహకరిస్తామన్న కేంద్రమంత్రి
  • మా అబ్బాయి ఏ తప్పూ చేయలేదు..
  • న్యాయవ్యవస్థపై సంపూర్ణ నమ్మకముంది

హైదరాబాద్ న్యూస్ టైమ్, హైదరాబాద్: తన కుమారుడు బండి భగీరథ్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టంపై ఉన్న గౌరవంతో ఈరోజు అడ్వోకేట్ల ద్వారా అతనిని పోలీసుల విచారణకు అప్పగించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. ‘‘సత్యమేవ జయతే’’ అంటూ ఆయన విడుదల చేసిన ప్రకటనలో.. చట్టం ముందు తన బిడ్డయినా, సామాన్యుడైనా సమానమేనని, అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. వాస్తవానికి ఫిర్యాదు రాగానే స్టేషన్‌లో అప్పగిద్దామనుకున్నప్పటికీ, తన కుమారుడు ఏ తప్పూ చేయలేదని పదేపదే చెప్పడం, లాయర్లను సంప్రదించి తమ వద్ద ఉన్న ఆధారాలను వారి ముందుంచడం వల్లే కొంత జాప్యం జరిగిందని వివరించారు. ఆ ఆధారాలను చూసి కేసు కొట్టేస్తారని, బెయిల్ తప్పకుండా వస్తుందని లాయర్లు చెప్పారని, ఈరోజు కూడా బెయిల్ వస్తుందని అంటున్నప్పటికీ, ఇంకా ఆలస్యం చేయడం సరికాదనే ఉద్దేశంతోనే స్వయంగా విచారణకు పంపించినట్లు పేర్కొన్నారు. సోమవారం నాడు కోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నప్పటికీ, దేశ న్యాయవ్యవస్థపై ఉన్న సంపూర్ణ నమ్మకం, గౌరవంతోనే లాయర్ల ద్వారా తన కుమారుడిని పోలీసులకు అప్పగించానని బండి సంజయ్ స్పష్టం చేశారు.