పోషించే స్తోమత లేక.. పురిటి బిడ్డ విక్రయం!
ముగ్గురు ఆడపిల్లల తర్వాత నాలుగో సంతానం..
రూ. 3 లక్షలకు బేరం
తల్లితో సహా 9 మంది అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్ న్యూస్ టైమ్, (కొల్చారం): కన్నపేగు కంచుకోట దాటింది.. పేదరికం ఆ తల్లిదండ్రులను కనికరం లేని మనుషులుగా మార్చింది. అప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారన్న భారంతో, పుట్టిన నాలుగో బిడ్డను రూ. 3 లక్షలకు విక్రయించిన ఘటన మెదక్ జిల్లాలో కలకలం రేపింది.
ఘటన వివరాలు: మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లి తాండాకు చెందిన దేవీసింగ్, శిరీష దంపతులకు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఈ ఏడాది మార్చి నెలలో మెదక్ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో శిరీష నాలుగో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, నిరుపేద కుటుంబం కావడం, అప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉండడంతో పెంచే స్తోమత లేక ఆ బిడ్డను విక్రయించాలని ఆ దంపతులు నిర్ణయించుకున్నారు.
కొందరు మధ్యవర్తుల సహాయంతో సిద్ధిపేట జిల్లా అల్లీనగర్ ప్రాంతానికి చెందిన సంతానం లేని కమలమ్మ, లింగయ్య దంపతులకు రూ. 3 లక్షలకు ఆ పసికందును అమ్మేశారు.
వెలుగులోకి వచ్చిందిలా.. ప్రసవం ముగిసిన తర్వాత తల్లి వద్ద శిశువు లేకపోవడాన్ని గమనించిన అంగన్వాడీ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. దీనిపై ఐసీడీఎస్ (ICDS) అధికారులకు సమాచారం అందించగా, వారు తాండాలో విచారణ చేపట్టారు. శిశువు విక్రయం జరిగినట్లు నిర్ధారణ కావడంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి పోలీసులు: కేసు నమోదు చేసుకున్న పోలీసులు లోతైన విచారణ జరిపి, పక్కా ఆధారాలతో నిందితులను పట్టుకున్నారు. శిశువు తల్లి, విక్రయానికి సహకరించిన మధ్యవర్తులు, కొనుగోలు చేసిన దంపతులతో సహా మొత్తం 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. చట్టవిరుద్ధంగా పిల్లల క్రయవిక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.