ప్రపంచ రికార్డుతో గెలిచిన ఇషా సింగ్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి అభినందనలు!

Published on: 28 May 2026, 05:03 AM
News Article

హైదరాబాద్‌ న్యూస్‌టైమ్‌, హైదరాబాద్‌, మే 28: ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ (ISSF) ప్రపంచ కప్-2026 షూటింగ్‌లో అసాధారణ ప్రతిభ కనబరిచి, చారిత్రాత్మక విజయం సాధించిన హైదరాబాద్‌ యువతి ఇషా సింగ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘనంగా అభినందనలు తెలిపారు. జర్మనీలోని మ్యూనిచ్‌లో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్ కప్‌ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో ఇషా సింగ్‌ ఏకంగా 43 హిట్స్ సాధించి, అద్భుతమైన స్కోర్‌తో ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఇషా సాధించిన ఈ అద్భుత విజయం భారత షూటింగ్ క్రీడా చరిత్రలోనే ఒక చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి కొనియాడారు. మన హైదరాబాద్‌కు చెందిన ఇషా సింగ్ తన అంకితభావం, క్రమశిక్షణ, అచంచలమైన పట్టుదలతో దేశంలోని లక్షలాది మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తోందని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రశంసించారు. అంతర్జాతీయ వేదికపై ఆమె కనబరిచిన ఈ అద్భుత ప్రదర్శన భారత క్రీడాకారులందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని, ఇది దేశ క్రీడల ఉజ్వల భవిష్యత్తుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఇషా సింగ్ భవిష్యత్తులో మరెన్నో అంతర్జాతీయ విజయాలు సాధించి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని.. మన దేశానికి, తెలంగాణ రాష్ట్రానికి మరింత కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆకాంక్షించారు.