ప్రపంచానికి ఎబోలా ముప్పు.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటన!
- కాంగో, ఉగాండాల్లో విజృంభిస్తున్న వైరస్..
- 300కు పైగా అనుమానిత కేసులు
- ఇప్పటికే 88 మంది మృతి..
- అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)
హైదరాబాద్ న్యూస్ టైమ్, అంతర్జాతీయ డెస్క్: ఆఫ్రికా దేశాలైన కాంగో, ఉగాండాల్లో ఎబోలా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రపంచవ్యాప్త ఆరోగ్య అత్యవసర పరిస్థితిని (గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ) ప్రకటించింది. అసోసియేటెడ్ ప్రెస్ (AP) నివేదిక ప్రకారం.. ఈ రెండు దేశాల్లో ఎబోలా మహమ్మారి తీవ్ర రూపం దాల్చగా, ప్రస్తుతం 300కు పైగా అనుమానిత కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడి ఇప్పటికే కనీసం 88 మంది మరణించినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వైరస్ ఇతర దేశాలకు వేగంగా వ్యాపించే ముప్పు ఉండటంతో డబ్ల్యూహెచ్‌ఓ అంతర్జాతీయ సమాజానికి అత్యున్నత స్థాయి హెచ్చరికలు జారీ చేసింది. వ్యాధి నియంత్రణకు, సరిహద్దుల వద్ద నిఘా పెంచేందుకు తక్షణ నిధులు, అంతర్జాతీయ వైద్య బృందాల సహాయం అవసరమని స్పష్టం చేయడంతో ప్రపంచ దేశాలు మరోసారి అప్రమత్తమయ్యాయి.