ప్రముఖ ఫుడ్ బ్రాండ్లకు FSSAI షాక్!
న్యూఢిల్లీ, జూన్ 20 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): ప్రముఖ ఫుడ్ బ్రాండ్లయిన బికానెర్‌వాలా, మారికో లిమిటెడ్, పారామ్ డెయిరీ, ఫెర్రెరో ఇండియాతో పాటు పలు ఇతర ఆహార తయారీ సంస్థలకు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) గట్టి షాక్ ఇచ్చింది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, తప్పుదోవ పట్టించే ప్రకటనలు, లేబ్లింగ్ నిబంధనల ఉల్లంఘనలపై స్పందించిన నియంత్రణ సంస్థ.. సదరు కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. కిచెన్ ఏరియాలో సిబ్బంది ఆహారం తింటూ అపరిశుభ్రంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదుపై 'బికానెర్‌వాలా'కు, రైల్వే ఐఆర్‌సీటీసీ (IRCTC) క్యాటరింగ్ ద్వారా సరఫరా చేసిన దహీ, రబ్రీలలో బూజు (ఫంగల్ ఇన్ఫెక్షన్) వచ్చిందన్న ఫిర్యాదుపై 'పారామ్ డెయిరీ'కి నోటీసులు పంపినట్లు పేర్కొంది. అలాగే, 'సఫోలా టోటల్ హార్ట్ ప్రో' ఆయిల్ ద్వారా గుండెకు ప్రత్యేక ప్రయోజనాలు చేకూరుస్తాయంటూ మారికో లిమిటెడ్ చేస్తున్న ప్రకటనలు, 'కిండర్ జాయ్' చాక్లెట్ ప్యాకెట్‌పై 'రిచ్ ఇన్ మిల్క్ సాలిడ్స్' అంటూ ఫెర్రెరో ఇండియా ఇస్తున్న సమాచారం వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఆక్షేపించింది. ఈ లోపాలపై తక్షణమే వివరణ ఇస్తూ.. తీసుకున్న చర్యలపై యాక్షన్ టేకెన్ రిపోర్ట్ (ATR) సమర్పించాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశించింది.