ప్రాణం తీసిన ఏసీ..
అనకాపల్లి: గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఊహించని ప్రమాదం ఒక ప్రాణాన్ని బలితీసుకుంది. అనకాపల్లి జిల్లా కేంద్రమైన లక్ష్మీదేవిపేటలో ఏసీ (Air Conditioner) ఒక్కసారిగా పేలిపోవడంతో 75 ఏళ్ల రేబాక రామారావు అనే వృద్ధుడు మృతి చెందారు.
అసలేం జరిగిందంటే..
లక్ష్మీదేవిపేటకు చెందిన రామారావు తన గదిలో నిద్రిస్తుండగా, తెల్లవారుజామున సుమారు 4 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఏసీలో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. క్షణాల్లో గది అంతా దట్టమైన పొగ, మంటలు వ్యాపించాయి. దురదృష్టవశాత్తూ రామారావు ఆ మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
అప్రమత్తమైన కుటుంబ సభ్యులు..
పేలుడు శబ్దం విన్న వెంటనే పక్క గదిలో నిద్రిస్తున్న భార్య, పిల్లలు ఉలిక్కిపడి లేచారు. వారు వెంటనే అప్రమత్తమై బయటకు పరుగులు తీయడంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. లేదంటే మరిన్ని ప్రాణ నష్టాలు సంభవించేవని స్థానికులు చెబుతున్నారు. ఏసీ పేలుడు వార్త విన్న స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.