ప్రాణం మీదకు తెచ్చిన ఇన్‌స్టా రీల్ వంటకం..

Published on: 05 May 2026, 06:31 AM
News Article

హైదరాబాద్ న్యూస్ టైమ్ | మే 05, 2026

కాకినాడ: సోషల్ మీడియా ప్రభావం ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తోంది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది కదా అని కొందరు చేసే రీల్స్, వాటిని గుడ్డిగా నమ్మే సామాన్యుల పాలిట శాపంగా మారుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వచ్చిన ఒక రీల్ చూసి, ఉమ్మెత్త పువ్వు కూర ఆరోగ్యం అని నమ్మిన ఓ కుటుంబం ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది. తూర్పు గోదావరి జిల్లా ఎర్రంపాలెం గ్రామానికి చెందిన గంగాభవాని, వీరలక్ష్మి, వీరబ్బు, జయలక్ష్మి సోమవారం పప్పులో ఉమ్మెత్త పువ్వు వేసి కూర వండుకుని తిన్నారు. తిన్న కాసేపటికే తీవ్ర అస్వస్థతకు గురికావడంతో స్థానికులు షాక్ అయ్యారు.

బాధితులంతా హైదరాబాద్‌లో నివాసం ఉంటుండగా, గ్రామ దేవత జాతర కోసం సొంత ఊరికి వచ్చారు. వికృతమైన రీల్స్‌ను నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకున్న వీరందరినీ వెంటనే కాకినాడ జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. ఉమ్మెత్త పువ్వులో అత్యంత ప్రమాదకరమైన విషపూరిత పదార్థాలు ఉంటాయని, దీనికి ప్రత్యేకమైన విరుగుడు ఉండదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో పాయిజన్ శాతం పెరిగితే ప్రాణాపాయం తప్పదని, ప్రస్తుతం బాధితుల పరిస్థితి విషమంగా ఉందని వారు తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే చిట్కాలను గుడ్డిగా నమ్మి ఇలాంటి ప్రయోగాలు చేయవద్దని అధికారులు కోరుతున్నారు.