భూపాలపల్లి, అక్టోబర్ 2, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): వివాహేతర సంబంధానికి అడ్డుగా మారాడన్న ఒకే ఒక్క కారణంతో కట్టుకున్న భర్తను అత్యంత దారుణంగా కడతేర్చిన ఘటన భూపాలపల్లి జిల్లాలో వెలుగు చూసింది. ప్రియుడితో కలిసి పురుగుల మందు కలిపిన మద్యం తాగించి, భర్తను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించిన భార్య బండారం చివరికి పోలీసుల దర్యాప్తులో బయటపడింది. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్దారం గ్రామానికి చెందిన సుమలత అనే మహిళను, గోల్లపల్లికి చెందిన పెండల సంపత్ (32) పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉండగా, సంపత్ ప్లంబర్ పనులు చేస్తూ అత్తగారింట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో సుమలతకు అదే గ్రామానికి చెందిన ఉమ్మల శ్రీకాంత్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ అక్రమ సంబంధానికి భర్త సంపత్ అడ్డుగా మారుతున్నాడని భావించిన సుమలత, ప్రియుడు శ్రీకాంత్‌తో కలిసి అతన్ని అడ్డుతొలగించుకోవాలని పథకం పన్నింది.
పథకం ప్రకారం.. తమకు సహకరిస్తే లక్ష రూపాయలు ఇస్తామని ఆశ చూపి తరుణ్ అనే మరో వ్యక్తి సహాయం తీసుకున్నారు. ఈ నెల 17వ తేదీన శ్రీకాంత్, తరుణ్ కలిసి సంపత్‌ను మద్యం తాగేందుకు పిలిచారు. ఊరిలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల మైదానంలో వారు సంపత్‌కు తెలియకుండా మద్యంల పురుగుల మందు కలిపి తాగించారు. ఆ విష మందు ప్రభావంతో సంపత్ ప్రాణాలు కోల్పోయాడు. అతను మృతి చెందిన తర్వాత శ్రీకాంత్, తరుణ్‌లు కలిసి మృతదేహాన్ని బైక్‌పై సంపత్ ఇంటికి తీసుకెళ్లారు. మృతదేహం చుట్టూ పురుగుల మందు డబ్బాలు పెట్టి, తన భర్త తానే స్వయంగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని సుమలత గ్రామస్తులను, సంపత్ కుటుంబ సభ్యులను నమ్మించింది. పోలీసులు కూడా ప్రాథమికంగా ఆత్మహత్యగానే కేసు నమోదు చేసి పోస్టుమార్టం పూర్తి చేయడంతో, తాము ఎప్పటికీ పట్టుబడమని నిందితులు భావించారు. అయితే తన కొడుకు మృతిపై అనుమానం ఉందని, అది ముమ్మాటికీ హత్యేనంటూ మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును తీవ్రతరం చేశారు. విచారణలో భాగంగా సాంకేతిక ఆధారాలు, సాక్ష్యాలను సేకరించడంతో అసలు నిజాలు బయటపడ్డాయి. పోలీసుల గాలింపు తీవ్రం కావడంతో భయపడిపోయిన నిందితులు శ్రీకాంత్, సుమలత పెద్దల సమక్షంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.