ప్రియుడిని నరికి చంపిన తల్లి, కొడుకు!

Published on: 05 May 2026, 03:19 AM
News Article

హైదరాబాద్ న్యూస్ టైమ్ | మే 05, 2026 జీడిమెట్ల: హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గల చింతల్ - అంబేద్కర్ నగర్‌లో ఆదివారం అర్ధరాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది. తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని ఓ మహిళ తన కుమారుడితో కలిసి మటన్ కత్తితో నరికి కిరాతకంగా చంపేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని అన్నమయ్య జిల్లాకు చెందిన శివారెడ్డి (40) అనే వ్యక్తి, ఓ మహిళతో గత పదేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. వీరితో పాటే ఆ మహిళకు చెందిన 19 ఏళ్ల కుమారుడు కూడా ఉంటున్నాడు.

అయితే, శివారెడ్డి నిత్యం తనను వేధిస్తున్నాడని, ఆ కక్షతో ఆదివారం రాత్రి తల్లి, కొడుకు కలిసి పథకం ప్రకారం అతనిపై దాడి చేశారు. మటన్ కత్తితో విచక్షణారహితంగా నరకడంతో శివారెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా శవాన్ని ఒక సంచిలో మూటకట్టి మాయం చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పోలీసులకు పక్కా సమాచారం అందడంతో, వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న జీడిమెట్ల పోలీసులు నిందితులైన తల్లి, కొడుకును రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.