ప్రియురాలిని ముక్కలు చేసి ఫ్రిడ్జిలో పెట్టిన నేవీ ఉద్యోగి!

Published on: 30 Mar 2026, 03:15 AM
News Article

విశాఖపట్నం: స్టీల్ సిటీ విశాఖలో అత్యంత కిరాతక ఘటన వెలుగుచూసింది. వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకోవడమే కాకుండా, సభ్యసమాజం తలదించుకునేలా చేసిన ఈ దారుణం గాజువాక పరిధిలోని ఎల్‌వీ నగర్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..

గాజువాక ఎల్‌వీ నగర్‌లో నివసించే రవీంద్ర అనే వ్యక్తి భారత నౌకాదళం (Navy)లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రవీంద్రకు వివాహం జరిగి భార్య ఉన్నప్పటికీ, మౌనిక (28) అనే వివాహితతో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అయితే, ఇటీవల మౌనిక డబ్బుల కోసం రవీంద్రను వేధిస్తున్నట్లు సమాచారం.

పథకం ప్రకారం హత్య..

రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్లిన సమయాన్ని చూసి, మౌనికను తన ఇంటికి పిలిపించాడు. ఈ క్రమంలో డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన రవీంద్ర, కత్తితో మౌనికను కిరాతకంగా చంపేశాడు. అనంతరం ఆమె శరీరాన్ని ముక్కలుగా కోసి, సగం భాగాలను ఫ్రిడ్జిలో దాచగా.. మిగిలిన సగ భాగాన్ని ఒక మూటలో కట్టి ఇంట్లోనే ఒక మూలకు పెట్టాడు.

పోలీసుల ఎదుట లొంగుబాటు

హత్య చేసిన అనంతరం రవీంద్ర నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. మౌనిక వేధింపులు భరించలేకే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు.

మిస్టరీగా మారిన 'తల': పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహ భాగాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, మౌనిక తల మాత్రం అక్కడ లభించకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. రవీంద్ర తలను ఎక్కడైనా పారేశాడా లేక మరేదైనా చేశాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.