ప్రేమ పేరుతో విదేశీ వైద్య విద్యకు స్వస్తి.. రూ. 34 లక్షలు కాజేసిన కిలాడీ ప్రియుడు!
హైదరాబాద్, జూలై 02, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ యువకుడిని గుడ్డిగా నమ్మి, వైద్య విద్యను సైతం వదిలేసి వచ్చిన యువతి చివరకు మోసపోయిన ఉదంతం బాచుపల్లిలో వెలుగుచూసింది. ఖమ్మం జిల్లాకు చెందిన సదరు యువతి విదేశాల్లో వైద్య విద్య అభ్యసిస్తుండగా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బాచుపల్లికి చెందిన ఇంటీరియర్ డిజైనర్ ఎన్.చందుతో పరిచయమైంది. ఈ పరిచయం ప్రేమగా మారడంతో, చందు మాటలను నమ్మి చదువును మధ్యలోనే ఆపేసి యువతి భారత్‌కు తిరిగి వచ్చింది. తల్లికి చందును తన ప్రియుడిగా పరిచయం చేసిన యువతి, ఇద్దరం కలిసి కేఫ్ వ్యాపారం ప్రారంభిస్తామని చెప్పింది. దీనిని నమ్మిన ఆ తల్లి, తమ కష్టార్జితమైన రూ. 34 లక్షలను చందుకి అప్పగించింది. అయితే, కాలక్రమేణా వ్యాపారం ప్రారంభం కాకపోవడం, పెళ్లి గురించి అడిగినప్పుడల్లా చందు దాటవేస్తూ నిరాకరించడంతో బాధితులకు అనుమానం కలిగింది. దీంతో వారు ఆరా తీయగా, చందుకి అప్పటికే వివాహమైందనే నిజాం బయటపడింది. తాము తీవ్రంగా మోసపోయామని గ్రహించిన బాధితురాలు, ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు చందును అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు.