ప్రోటోకాల్ ఉల్లంఘన: సనత్ నగర్‌లో మంత్రి కొండా సురేఖ సమీక్ష!
హైదరాబాద్, జూలై 09, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణోత్సవం, బోనాల ఏర్పాట్లపై నిర్వహించిన సమన్వయ సమావేశంలో ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నిర్వహించిన ఈ సమీక్షా సమావేశానికి, స్థానిక ఎమ్మెల్యే మరియు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఆహ్వానించకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ప్రజాప్రతినిధిని సంప్రదించి, సమావేశాలకు ఆహ్వానించాల్సి ఉన్నప్పటికీ, మంత్రి కొండా సురేఖ కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు, నియోజకవర్గంలో ఓడిపోయిన అభ్యర్థులతోనే ఈ కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లమ్మ జాతర ఏర్పాట్లకు సంబంధించిన పోస్టర్లను కూడా మంత్రి వారితో కలిసి ఆవిష్కరించారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధం ఉన్న స్థానిక ఎమ్మెల్యేను పక్కనపెట్టి, పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించడంపై స్థానికంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ జాతర వంటి సున్నితమైన, సంప్రదాయ కార్యక్రమాల్లో రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని పోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.