ఫాస్టాగ్ ద్వారానే నేరుగా ట్రాఫిక్ చలాన్ల వసూలు?.. కొత్త విధానానికి సన్నద్ధమవుతున్న తెలంగాణ ప్రభుత్వం

Published on: 26 Aug 2026, 03:59 AM
News Article

హైదరాబాద్, ఆగస్ట్ 26, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు చెక్ పెట్టేందుకు మరియు పెండింగ్ చలాన్ల వసూళ్లను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం సరికొత్త పద్ధతికి శ్రీకారం చుట్టే ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి, నిర్దేశిత గడువులోపు చలాన్ చెల్లించకపోతే.. నేరుగా వారి వాహన ఫాస్టాగ్ (FASTag) ఖాతా నుంచే ఫైన్ అమౌంట్ కట్ అయ్యే సరికొత్త విధానాన్ని అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఎలా అమలు చేయనున్నారు? హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) ఆధ్వర్యంలో ఈ వినూత్న విధానానికి రూపకల్పన జరుగుతోంది. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు (ORR) మరియు నగర పరిధిలోని ప్రధాన రహదారులపై ఉన్న ఫాస్టాగ్ టోల్ గేట్లు, స్కానింగ్ వ్యవస్థను ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ చలాన్ల వ్యవస్థతో అనుసంధానించాలని ప్రభుత్వం భావిస్తోంది. వాహనం టోల్‌ప్లాజా దాటే సమయంలో పెండింగ్ చలాన్లు ఉంటే, ఫాస్టాగ్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్‌గా ఆ మొత్తం మినహాయించుకునేలా టెక్నాలజీని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా చలాన్ల చెల్లింపు ప్రక్రియ మరింత పారదర్శకంగా మారుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.