ఫ్రాన్స్‌లో టెలిమార్కెటింగ్ కాల్స్‌పై నిషేధం
Published on: 06 Aug 2026, 05:38 AM
పారిస్, ఆగస్ట్ 6, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): వినియోగదారులకు చికాకు తెప్పించే మార్కెటింగ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎమర్జెన్సీ సేల్స్ ప్రపోజల్స్ నుంచి వినియోగదారులను రక్షించడానికి, ముఖ్యంగా వృద్ధులు మరియు బలహీన వర్గాలను మోసపూరిత వ్యాపార పద్ధతుల బారిన పడకుండా కాపాడేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం ఒక నూతన చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం రాబోయే వారం రోజుల్లో (ఆగస్ట్ 11 నుంచి) ఫ్రాన్స్‌లో అవాంఛిత టెలిమార్కెటింగ్ కాల్స్ పూర్తిగా నిషేధించబడనున్నాయి.
- చట్టం విశేషాలు & కారణాలు:
- సంవత్సరాలుగా వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో అధ్యక్షుడు ఇമ്మాన్యుయేల్ మాక్రాన్ ప్రభుత్వం ఈ చట్టానికి శ్రీకారం చుట్టింది.
- ఫ్రాన్స్‌లో సుమారు ముప్పాతిక వంతు ప్రజలు ప్రతి వారం కనీసం ఒక్క అవాంఛిత సేల్స్ కాల్‌నైనా అందుకుంటున్నట్లు అధికారిక అంచనా.
- గతంలో 'డూ నాట్ కాల్' జాబితా ఉన్నప్పటికీ కొన్ని కాల్ సెంటర్లు వాటిని బేఖాతరు చేయడంతో.. ఇకపై వినియోగదారుల ముందస్తు సమ్మతి (Consent) లేనిదే కంపెనీలు నేరుగా ఫోన్ చేయడానికి వీలే లేదని కాంపిటీషన్ అండ్ ఫ్రాడ్ ప్రివెన్షన్ డిపార్ట్‌మెంట్ (DGCCRF) హెచ్చరించింది.
- భారీ జరిమానాలు: నిబంధనలను ఉల్లంఘించి అవాంఛిత కాల్స్ చేసే వ్యక్తులకు ఒక్కో కాల్‌కు 75,000 యూరోల (దాదాపు $87,000) వరకు, కంపెనీలకు ఏకంగా 375,000 యూరోల (దాదాపు $435,000) వరకు భారీ జరిమానా విధించనున్నారు. అయితే వినియోగదారుల స్వచ్ఛంద సమ్మతి ఉన్నా లేదా ముందే వ్యాపార సంబంధిత ఒప్పందాలు ఉన్న సందర్భాల్లో మినహాయింపు ఉంటుంది.
ఫ్రాన్స్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం వల్ల తమ దేశంలోని కాల్ సెంటర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని మొరాకో వంటి దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, జర్మనీ, బ్రిటన్, అమెరికా వంటి దేశాలు ఇప్పటికే ఇలాంటి నిబంధనలను అమలు చేస్తున్నాయి.