బంగారం తాకట్టు పెట్టినా దక్కని చదువు: ఫీజుల వేధింపులకు ఇంజినీరింగ్ విద్యార్థి బలి
హైదరాబాద్: ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రైవేట్ కాలేజీల ఫీజుల వేధింపులు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ సకాలంలో అందకపోవడం, కాలేజీ యాజమాన్యం కనికరం లేకుండా ప్రవర్తించడంతో ప్రణీత్ (21) అనే ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
హాల్ టికెట్ కోసం వేడుకున్నా కనికరించని వైనం
జగిత్యాల జిల్లాకు చెందిన ప్రణీత్, హయత్‌నగర్‌లో నివసిస్తూ ఇబ్రహీంపట్నంలోని శ్రీఇందు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. రెండు నెలల క్రితం జరిగిన ప్రమాదం కారణంగా కాలేజీకి రాలేకపోయిన ప్రణీత్, పరీక్షల కోసం హాల్ టికెట్ ఇవ్వాలని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కృష్ణమూర్తిని వేడుకున్నాడు. అయితే, 95 వేల ఫీజుతో పాటు 5 వేల జరిమానా కడితేనే హాల్ టికెట్ ఇస్తామని, లేదంటే పరీక్ష రాయలేవని యాజమాన్యం కరాఖండిగా చెప్పింది.
తండ్రిని అవమానించడంతో మనస్తాపం
ప్రణీత్ తండ్రి రమేష్, కొడుకు చదువు కోసం ఊరికి వెళ్లి బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకునే ప్రయత్నంలో ఉండగా.. కాలేజీ సిబ్బంది ఆయనకు ఫోన్ చేసి బెదిరించారు. శనివారం లోపు డబ్బు కట్టకపోతే నీ కొడుకు భవిష్యత్తు నాశనం అవుతుందంటూ హెచ్చరించారు. అటు కాలేజీలో తనను 45 నిమిషాల పాటు గదిలో నిలబెట్టి అవమానించడం, ఇటు తండ్రిని ఇబ్బంది పెట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రణీత్ శనివారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
కాలేజీ ముందు యుద్ధ వాతావరణం.. పోలీసుల లాఠీచార్జ్
ప్రణీత్ మృతికి కాలేజీ యాజమాన్యమే కారణమంటూ బంధువులు, విద్యార్థి సంఘాలు ఆదివారం రాత్రి శ్రీఇందు కాలేజీ ముందు భారీ ఆందోళన చేపట్టారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉన్నత చదువులతో కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన కొడుకు ఇలా శవమై పడి ఉండటంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.