బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో కేసులో సంచలన ట్విస్ట్‌లు
- బాధితురాలి ఫోన్ హ్యాకింగ్‌కు నిందితుల యత్నం
- నో చెప్పిన యంగ్ హ్యాకర్
-
హైదరాబాద్, మే 12 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన పోక్సో (POCSO) కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు నుంచి బయటపడేందుకు నిందితులు దారుణమైన ఎత్తుగడలు వేసినట్లు తెలుస్తోంది. బాధితురాలి ఫోన్‌ను హ్యాక్ చేయించి, అందులోని కీలక ఆధారాలను ధ్వంసం చేసేందుకు 'బండి గ్యాంగ్' ప్రయత్నించినట్లు సమాచారం.
హ్యాకింగ్ కోసం యువ నిపుణుడి సంప్రదింపులు.. హైదరాబాద్‌కు చెందిన 20 ఏళ్ల ఓ యువ ప్రైవేట్ ఎథికల్ హ్యాకర్ ద్వారా ఈ కుట్రకు తెరలేపినట్లు తెలుస్తోంది. మైనర్ బాధితురాలి ఫోన్‌ను హ్యాక్ చేసి, ఆమె మొబైల్‌లో ఉన్న కీలక డేటాను పూర్తిగా డిలీట్ చేయాలని నిందితులు సదరు యువకుడిని కోరారు. అయితే, ఇది చాలా పెద్ద కేసు అని, బాధితురాలు మైనర్ కావడంతో తాను కూడా పోక్సో కేసులో ఇరుక్కుంటానని భావించిన ఆ యువ హ్యాకర్.. వారి ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్లు సమాచారం.
సైబర్ క్రైమ్ అనలిస్ట్‌గా గుర్తింపు.. నిందితులు సంప్రదించిన సదరు యువ హ్యాకర్ చిన్న వయస్సులోనే హ్యాకింగ్ రంగంలో విశేష ప్రతిభ కనబరిచారు. కేవలం 15 ఏళ్ల వయస్సులో, 10వ తరగతి చదువుతున్నప్పుడే హ్యాకింగ్‌పై ఇంటర్వ్యూలు ఇచ్చిన ఈ యువకుడు, గతంలో పోలీసులతో కలిసి పనిచేశారు. సైబర్ నేరాల విశ్లేషణలో పోలీసులకు సహకరిస్తూ 'సైబర్ క్రైమ్ అనలిస్ట్'గా మంచి పేరు తెచ్చుకున్నారు. అటువంటి నిపుణుడిని సంప్రదించి డేటా డిలీట్ చేయాలని చూడటం ఇప్పుడు పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ హ్యాకింగ్ ప్రయత్నం వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.