బండి సంజయ్ కొడుకుపై ‘లుక్ అవుట్’ నోటీసులు ఇవ్వాలి

Published on: 13 May 2026, 12:43 PM
News Article
  • నిందితులను దేశం దాటించడం బీజేపీకి అలవాటే..
  • బాధితురాలికి న్యాయం జరగాలి
  • పాలమూరుకు జాతీయ హోదా ఎక్కడ?
  • ప్రధాని పర్యటనపై టీఆర్ఎస్ చీఫ్ నిప్పులు

హైదరాబాద్ (హైదరాబాద్ న్యూస్‌టైమ్ బ్యూరో): కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై వచ్చిన పోక్సో కేసు ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నిందితుడు విదేశాలకు పారిపోకుండా తక్షణమే ‘లుక్ అవుట్’ నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ప్రధాని వేదికపై నిందితుడి తండ్రి ఉండటమా? "కుటుంబ సభ్యులపై గంభీరమైన పోక్సో ఆరోపణలు వచ్చినప్పుడు బండి సంజయ్ ప్రధాని సభకు వెళ్లాల్సింది కాదు. బాధితురాలికి న్యాయం చేయాల్సింది పోయి, ప్రధానితో వేదిక పంచుకోవడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపింది. బడాబాబుల పిల్లలు ఏం చేసినా పోలీసులు చర్యలు తీసుకోరన్న నమ్మకాన్ని ఈ ఘటన బలపరుస్తోంది. నిందితులను దేశం దాటించే అలవాటు బీజేపీకి ఉంది, ప్రజ్వల్ రేవణ్న కేసులో అది నిరూపితమైంది. అందుకే బండి సంజయ్ కుమారుడిపై లుక్ అవుట్ నోటీసులు ఇవ్వాలి" అని కవిత డిమాండ్ చేశారు. బాధితురాలి ఫోటోలను బయటపెట్టిన బీఆర్ఎస్ సోషల్ మీడియా తీరును కూడా ఆమె తప్పుబట్టారు.

తెలంగాణకు మోదీ మొండిచెయ్యి.. గురువును చూసి నేర్చుకో రేవంత్! ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనపై స్పందిస్తూ.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా విషయంలో ప్రధాని మరోసారి మొండిచెయ్యి చూపారని మండిపడ్డారు. "ప్రధాని ఆంధ్రాకు పైసలు ఇచ్చి.. మనకు పొదుపు సూత్రాలు చెప్పి వెళ్లారు. పాలమూరుపై సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు, అడగాల్సిన బీఆర్ఎస్ నోరు మెదపడం లేదు. పొరుగు రాష్ట్రంలో పోలవరం కోసం చంద్రబాబు గారు శ్రమిస్తుంటే.. రేవంత్ మాత్రం ఒక్క రివ్యూ కూడా చేయలేదు. మీ గురువును చూసైనా నేర్చుకో రేవంత్" అంటూ ఘాటుగా విమర్శించారు.

అధికారంలోకి రాగానే ‘వాటర్ కమిషన్’ నీళ్ల కోసమే ఏర్పడిన తెలంగాణలో మన వాటాను వాడుకోలేని దుస్థితిలో ఉన్నామని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. "మేము అధికారంలోకి వచ్చాక సాగు యోగ్యమైన ప్రతి గుంట భూమికి నీళ్లిస్తాం. ఇందుకోసం ప్రత్యేకంగా ‘వాటర్ కమిషన్’ ఏర్పాటు చేస్తాం. ప్రతి మూడు వేల ఎకరాలకు ఒక ‘లష్కర్’ను నియమించి, నదులపై పటిష్టమైన చెక్ డ్యామ్‌లు నిర్మిస్తాం" అని భరోసా ఇచ్చారు.

నీట్ లీకేజీపై ఆగ్రహం: పది రూపాయల డైపర్ కూడా లీక్ కావడం లేదు! నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కవిత తీవ్రంగా స్పందించారు. "ఇంత టెక్నాలజీ వచ్చాక కూడా పేపర్ లీక్ కాకుండా చూడలేరా? పది రూపాయల డైపర్ కూడా లీక్ కావడం లేదు కానీ, విద్యార్థుల భవిష్యత్తు అయిన నీట్ పేపర్ లీక్ అవుతోంది" అని ఎద్దేవా చేశారు.

రైల్వే కోర్టుకు కవిత హాజరు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం కామారెడ్డిలో గతంలో నిర్వహించిన ‘రైల్ రోకో’ కేసులో కవిత బుధవారం నాంపల్లి రైల్వే కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణను మేజిస్ట్రేట్ జూలై 17కు వాయిదా వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీసీల హక్కుల కోసం జైలుకైనా వెళ్తామని, ఉద్యమం ఆపబోమని స్పష్టం చేశారు.