బండి సంజయ్‌ను కేబినెట్ నుంచి తప్పించండి: కే.కవిత డిమాండ్!

Published on: 16 May 2026, 08:13 AM
News Article
  • ప్రధాని మోదీకి లేఖ రాసిన ..
  • తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
  • హోంశాఖ పదవిలో ఉంటే పోక్సో కేసు..
  • దర్యాప్తు ప్రభావితం అవుతుందని ఆందోళన

హైదరాబాద్ న్యూస్ టైమ్, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన పోక్సో (POCSO) కేసులో విచారణ పారదర్శకంగా జరగాలంటే ఆయనను తక్షణమే మంత్రివర్గం నుంచి తొలగించాలంటూ తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఒక బహిరంగ లేఖ రాశారు. బండి సంజయ్ కుమారుడిపై పెట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (BNS) తో పాటు అత్యంత తీవ్రమైన బాలల లైంగిక నేరాల నిరోధక చట్టం (పోక్సో) కింద ఎఫ్‌ఐఆర్ నమోదైన విషయాన్ని ఆమె లేఖలో ప్రస్తావించారు. చట్టాన్ని అమలు చేసే అత్యంత కీలకమైన కేంద్ర హోంశాఖ పదవిలో బండి సంజయ్ కొనసాగడం వల్ల దర్యాప్తు ప్రక్రియ, సాక్ష్యాల సేకరణ, మరియు సాక్షుల రక్షణపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో మైనర్ల రక్షణ, న్యాయవ్యవస్థ సమగ్రత అనేది రాజకీయ ప్రయోజనాల కంటే మిన్న అని ప్రధాని గుర్తించాలన్న కవిత.. బాధితురాలికి పూర్తి న్యాయం జరగాలన్నా, ప్రజాస్వామ్య వ్యవస్థలపై ప్రజల్లో నమ్మకం కలగాలన్నా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేని స్వతంత్ర దర్యాప్తు అవసరమని, అందువల్ల రాజ్యాంగ నిబద్ధతను, నైతిక విలువలను కాపాడుతూ కేసు విచారణ పూర్తయ్యే వరకు బండి సంజయ్‌ను మంత్రి పదవి నుండి తక్షణమే తప్పించాలని డిమాండ్ చేశారు.