🚨 బంపర్ ఆఫర్: ఎయిర్‌టెల్ సిమ్ తీసుకోండి.. లీటర్ పెట్రోల్ ఫ్రీగా కొట్టేయండి!
హైదరాబాద్ న్యూస్‌టైమ్ - భద్రాద్రి కొత్తగూడెం: పెట్రోల్ ధరలు మండిపోతున్న వేళ.. వాహనదారులకు ఒక క్రేజీ ఆఫర్ తగిలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో ఎయిర్‌టెల్ సిబ్బంది ప్రకటించిన ఓ వినూత్న ఆఫర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "మా నెట్‌వర్క్‌లోకి రండి.. ఉచితంగా పెట్రోల్ పట్టుకెళ్లండి" అంటూ వారు చేస్తున్న ప్రచారం జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
అసలేం జరిగింది? దమ్మపేట పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం పెట్రోల్ కొరత వేధిస్తోంది. బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. సరిగ్గా ఇదే సమయాన్ని అదునుగా చేసుకున్న ఎయిర్‌టెల్ ప్రమోటర్లు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. తమ నెట్‌వర్క్ మార్కెటింగ్‌ను పెంచుకోవడానికి పెట్రోల్‌ను ఎరగా వేశారు.
ఆఫర్ వివరాలు ఇవే:
- ఎవరైనా సరే తమ పాత నెట్‌వర్క్ నుండి ఎయిర్‌టెల్‌లోకి పోర్ట్ (MNP) అవ్వాలి.
- పోర్ట్ అయిన తర్వాత రూ. 350లతో రీచార్జ్ చేసుకోవాలి.
- అలా చేసిన వారికి వెంటనే ఒక లీటర్ పెట్రోల్ ఉచితంగా అందజేస్తామని ఎయిర్‌టెల్ సిబ్బంది ప్రకటించారు.
క్యూ కడుతున్న జనం: సాధారణంగా సిమ్ కార్డు కోసం షాపులకు వెళ్లే జనం.. ఇప్పుడు పెట్రోల్ ఫ్రీ అనగానే ఎయిర్‌టెల్ కౌంటర్ల వద్ద బారులు తీరుతున్నారు. "రీచార్జ్ ఎలాగో చేసుకుంటాం.. దాంతో పాటు లీటర్ పెట్రోల్ అంటే లాభమే కదా" అని జనం ఎగబడుతున్నారు. పెట్రోల్ కొరతను తమ బిజినెస్‌కు అనుకూలంగా మార్చుకున్న ఎయిర్‌టెల్ సిబ్బంది తెలివితేటలను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.