బడులు, గుడుల సమీపంలో మద్యం దుకాణాలు నిషిద్ధం: పశ్చిమ బెంగాల్ సీఎం శుభేందు అధికారి
హైదరాబాద్ న్యూస్‌టైమ్, కోల్‌కతా (కల్యాణి), మే 26: పశ్చిమ బెంగాల్‌లో విద్యాసంస్థలు, ఆధ్యాత్మిక కేంద్రాల పరిసరాల్లో మద్యం విక్రయాలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పాఠశాలలు, కళాశాలలు, దేవాలయాలకు ఒక కిలోమీటరు పరిధిలో మద్యం దుకాణాలకు అనుమతులు ఇచ్చేది లేదని ముఖ్యమంత్రి శుభేందు అధికారి స్పష్టం చేశారు. నదియా జిల్లా కల్యాణిలో మంగళవారం నిర్వహించిన పరిపాలనా సమీక్షా సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కేవలం 'పాలకుల పాలన' కాకుండా 'చట్టబద్ధ పాలన' సాగుతుందని పేర్కొన్న సీఎం.. మహిళలకు నెలకు రూ.3,000 అందించే 'అన్నపూర్ణ యోజన' ఫారాల పంపిణీ బుధవారం నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించారు. అలాగే పేదల కోసం రాష్ట్రవ్యాప్తంగా 400 కంటీన్లలో వారానికి రెండు రోజులు కేవలం రూ.5 లకే 'చేప-అన్నం' భోజనం అందిస్తామని వెల్లడించారు. సీఎం తీసుకున్న ఈ కీలక నిర్ణయాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.