బాబు బంగ్లా కూతవేటు దూరంలో రూ. 100 కోట్ల ఇసుక దోపిడీ!

Published on: 04 Jul 2026, 04:27 AM
News Article

విజయవాడ, జూలై 04, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): కృష్ణా నదీ గర్భాన్ని పచ్చ తోడేళ్లు చెరబట్టాయి. ప్రకాశం బ్యారేజీ ఎగువ, దిగువ ప్రాంతాల్లో ఇసుక మాఫియా అడ్డగోలుగా రెచ్చిపోతోంది. నిబంధనలను తుంగలో తొక్కి ఏకంగా 8 నుంచి 9 మీటర్ల లోతు వరకు నదీ గర్భాన్ని తవ్వేస్తూ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఈ అక్రమ ఇసుకను విజయవాడ, గుంటూరులతో పాటు హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాలకు తరలించి విక్రయిస్తూ.. ఇప్పటికే రూ. 100 కోట్లకు పైగా కొల్లగొట్టినట్లు సమాచారం.

ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలోనే.. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న అక్రమ బంగ్లాకు కూతవేటు దూరంలోనే ఈ స్మగ్లర్ల ఇష్టారాజ్యం నడుస్తోంది. కళ్ల ముందే ఇంత పెద్ద ఎత్తున దోపిడీ సాగుతున్నా అధికారులు కన్నెత్తి చూడకపోవడం వెనుక పెద్దల హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బ్యారేజీ దిగువన ఉన్న గుండిమెడ వద్ద భారీ యంత్రాలతో ఇసుకను తోడేస్తుండటంతో నదీ స్వరూపమే మారిపోయిందని పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మళ్లీ పాత రోజులు.. గతంలో 2014-19 మధ్య కాలంలోనూ ప్రకాశం బ్యారేజీ జల విస్తరణ ప్రాంతంలో స్మగ్లర్లు ఇదే రీతిలో ఇసుకను దోచేశారు. అప్పట్లో ఈ అక్రమ తవ్వకాలపై విచారణ జరిపిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT).. చంద్రబాబు ప్రభుత్వంపై ఏకంగా రూ. 100 కోట్ల భారీ జరిమానా విధించింది. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో నిబంధనలకు విరుద్ధంగా కృష్ణమ్మను గుల్ల చేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.