బార్లు, వైన్ షాపులకు ఏఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్!

Published on: 09 Apr 2026, 04:04 PM
News Article

ప్రొద్దుటూరు: పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీసులు రంగంలోకి దిగారు. జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, ప్రొద్దుటూరు ఏఎస్పీ శ్రీ విబు కృష్ణ ఐపీఎస్ పర్యవేక్షణలో పట్టణంలోని బార్లు, వైన్ షాపుల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు.

సీసీ కెమెరాలు తప్పనిసరి - ఏఎస్పీ ఆదేశాలు:

నేరాల నియంత్రణలో బార్లు, మద్యం దుకాణాల పాత్ర కీలకమని ఏఎస్పీ పేర్కొన్నారు. తనిఖీల్లో భాగంగా నిర్వాహకులకు పలు కీలక సూచనలు చేశారు:

  • సీసీ కెమెరాల నిఘా: ఏపీ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం ప్రతి షాపులో సీసీ కెమెరాలు ఉండాలి. అవి నిరంతరం పనిచేస్తూ, వీడియో బ్యాకప్ కచ్చితంగా ఉండాలని స్పష్టం చేశారు.
  • సమయపాలన: నిర్దేశించిన సమయానికి మించి మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
  • ముందస్తు సమాచారం: బార్ల వద్ద గొడవలు జరిగినా లేదా అనుమానాస్పద వ్యక్తులు సంచరించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.

షీటర్లపై నిఘా..

రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు మద్యం షాపుల వద్దకు వచ్చినప్పుడు వెంటనే పోలీసులకు అలర్ట్ ఇవ్వాలని త్రీ టౌన్ సీఐ రామాంజనేయుడు నిర్వాహకులను కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంలో వ్యాపారులు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ తనిఖీల్లో ఎస్సై మైనుద్దీన్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.