బాసర ఆలయంలో భారీ చోరీ.. మహంకాళి అమ్మవారి వెండి కిరీటం, హుండీ ఎత్తుకెళ్లిన దొంగలు!
నిర్మల్, జూన్ 23 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): నిర్మల్ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఆలయ ప్రాంగణంలోని పై అంతస్తులో ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి గుడిలోకి అర్ధరాత్రి చొరబడిన గుర్తుతెలియని దుండగులు.. అమ్మవారికి అలంకరించిన వెండి కిరీటంతో పాటు, పక్కనే ఉన్న కానుకల హుండీని ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత హుండీని పగులగొట్టి అందులోని నగదును దోచుకుని, ఖాళీ హుండీని సమీపంలోని వ్యాసగుడి వద్ద వదిలేసి పరారయ్యారు. ఉదయం గుడి తలుపులు తెరిచిన అర్చకులు ఇది గమనించి అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నిత్యం పటిష్టమైన భద్రత, పోలీసుల పహారా ఉండే ప్రధాన ఆలయంలోనే ఇలా దొంగతనం జరగడం భక్తులను, స్థానికులను తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న సీసీటీవీ (CCTV) ఫుటేజీలను పరిశీలిస్తూ దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.