బీఆర్‌ఎస్‌ను విమర్శించడానికే నకిరేకల్ సభనా..?

Published on: 05 Sep 2026, 05:19 PM
News Article

నకిరేకల్, సెప్టెంబర్ 5, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయిన నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో సభ నిర్వహించిన అనంతరం నకిరేకల్‌లో సభ నిర్వహించడంతో నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆశ పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి నకిరేకల్‌కు వస్తున్నారంటే నియోజకవర్గానికి ఏదో ఒక పెద్ద ప్రకటన వస్తుందని, అభివృద్ధికి నిధులు వస్తాయని, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులపై స్పష్టత వస్తుందని ప్రజలు ఆశించారు. వారం రోజులుగా సభ ఏర్పాట్లు హడావుడిగా సాగాయి, వందలాది మంది ప్రజలను సమీకరించారు. ఇంత భారీ ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో నకిరేకల్ ప్రజలు ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన అభివృద్ధి ప్రకటనలు ఆశించినప్పటికీ, సభ ముగిసిన తర్వాత నకిరేకల్ ప్రజానికానికి మిగిలింది మాత్రం నిరాశే అయింది.

గత ప్రభుత్వంలో మంజూరైన 100 పడకల ఆసుపత్రి ప్రారంభం ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. నకిరేకల్ 100 పడకల ఆసుపత్రి అనేది నిన్న మొన్న మంజూరైన ప్రాజెక్టు కాదు. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో, చిరుమర్తి లింగయ్య ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ ఆసుపత్రి మంజూరైంది. అప్పటి ప్రభుత్వ హయాంలోనే నిర్మాణ పనులు గణనీయంగా పూర్తయ్యాయి. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే ఆసుపత్రిని ప్రారంభించింది. ఆ ప్రారంభోత్సవాన్ని మేము వ్యతిరేకించడం లేదు. ప్రజలకు ఆసుపత్రి అందుబాటులోకి రావడం సంతోషకరమైన విషయమే. కానీ ప్రశ్న ఒక్కటే.. ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రి నకిరేకల్ నియోజకవర్గానికి కొత్తగా ఏం ఇచ్చారు.. ప్రజలు ఇదే ఆశించారు. కానీ ఆ ఆశలకు తగిన సమాధానం మాత్రం సభలో కనిపించలేదు.

బీఆర్‌ఎస్‌ను విమర్శించడానికే నకిరేకల్ సభనా..❓ అభివృద్ధి కార్యక్రమాల పేరుతో భారీ సభ నిర్వహించారు. ప్రజాధనం, ప్రభుత్వ యంత్రాంగం, అధికారుల సమన్వయంతో కార్యక్రమం జరిగింది. అయితే ముఖ్యమంత్రి ప్రసంగాన్ని పరిశీలిస్తే.. నకిరేకల్ అభివృద్ధి కంటే బీఆర్‌ఎస్ పార్టీని, కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపించింది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రజలు వినాలనుకునేది వారి సమస్యలు, వారి భవిష్యత్తు, అభివృద్ధి ప్రణాళికలు. కానీ సభలో మళ్లీ అదే రాజకీయ విమర్శలు, అదే ఆరోపణలు, అదే పాత అంశాల ప్రస్తావన కనిపించింది.

38 నిమిషాల ప్రసంగంలో నకిరేకల్‌కు ఎంత సమయం..❓ ముఖ్యమంత్రి గారి దాదాపు 38 నిమిషాల ప్రసంగాన్ని పరిశీలిస్తే.. ప్రారంభంలో సభా వేదికపై ఉన్న నాయకుల ప్రస్తావనకు కొంత సమయం అంటే 2-3 నిమిషాలు, సంక్షేమ పథకాల ప్రస్తావనకు కొంత సమయం అంటే 3-4 నిమిషాలు కేటాయించారు. కానీ మిగతా ప్రసంగంలో గణనీయమైన సమయం అంటే దాదాపు 30 నిమిషాలు కేసీఆర్ కుటుంబంపై రాజకీయ విమర్శలకే కేటాయించినట్లు స్పష్టంగా కనిపించింది. అందుకే నకిరేకల్ ప్రజలు ఒక ప్రశ్న అడుగుతున్నారు ముఖ్యమంత్రి గారు నకిరేకల్‌కు వచ్చారా? లేక కేసీఆర్, బీఆర్‌ఎస్‌ను విమర్శించడానికి వచ్చారా?

కేసీఆర్ జీతం, కేటీఆర్ చదువుపై వ్యాఖ్యలు ఎందుకు..❓ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలోకి వచ్చినప్పటి నుంచి ఆయన ప్రసంగాల్లో ప్రతీసారి కేసీఆర్, కేటీఆర్ పేర్లు వినిపిస్తున్నాయి. రాజకీయంగా విమర్శలు చేయడం సహజమే. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక అభివృద్ధి కార్యక్రమానికి వచ్చినప్పుడు, తన ప్రభుత్వం ఏం చేసింది? ప్రజలకు ఇంకా ఏం చేయబోతోంది? అనే విషయాలపై ఎక్కువగా మాట్లాడితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. కేసీఆర్ సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని నడిపించారు. అదేవిధంగా కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో హైదరాబాద్‌ను పెట్టుబడులు, ఐటీ, పారిశ్రామిక రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడంలో తనదైన పాత్ర పోషించారు. అలాంటి నాయకుల వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ రాజకీయ ప్రసంగాలు చేయడం కంటే తెలంగాణకు, నకిరేకల్‌కు మీ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పడం ముఖ్యమంత్రి బాధ్యత కాదా?

నకిరేకల్ నియోజకవర్గ అభివృద్ధి సంగతేంటి..❓ నకిరేకల్‌లో 100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవం కోసం ముఖ్యమంత్రి వచ్చారు. సహజంగానే ప్రజలు నకిరేకల్‌కు కొత్త అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు, సాగునీటి ప్రాజెక్టులకు స్పష్టమైన హామీలు, నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు గురించి ఆశించారు. కానీ ముఖ్యమంత్రి ప్రసంగంలో వీటిపై స్పష్టమైన ప్రకటనలు లేకపోవడం ప్రజలను నిరాశకు గురిచేసింది.

బ్రాహ్మణవెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టు సంగతేంటి..❓ నకిరేకల్ ప్రాంత ప్రజల చిరకాల కల బ్రాహ్మణవెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి కావాల్సిన చర్యలు ఏమిటి? ఎంత నిధులు అవసరం? ఇప్పటి వరకు ఎంత పని జరిగింది? మిగిలిన పనులను ఎప్పుడు పూర్తి చేస్తారు? ఈ ప్రశ్నలకు ముఖ్యమంత్రి సభలో స్పష్టత ఇస్తారని ప్రజలు ఆశించారు. కానీ ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి ప్రసంగంలో స్పష్టమైన ప్రకటన లేకపోవడం బాధాకరమైన విషయం.

అయిటిపాముల లిఫ్ట్‌పై సీఎం ఎందుకు మాట్లాడలేదు..❓ నకిరేకల్ నియోజకవర్గానికి అత్యంత ముఖ్యమైన సాగునీటి ప్రాజెక్టుల్లో అయిటిపాముల లిఫ్ట్ ఒకటి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించిన విషయం ప్రజలకు తెలిసిందే. అలాంటి కీలకమైన ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి నకిరేకల్ సభలో మాట్లాడి, ప్రస్తుత పరిస్థితి ఏమిటి? ఎప్పుడు పూర్తి చేస్తారు? ఎంత నిధులు కేటాయిస్తారు? అనే విషయాలపై స్పష్టత ఇస్తారని ప్రజలు ఆశించారు. కానీ ఆ ప్రాజెక్టు ప్రస్తావన కూడా ముఖ్యమంత్రి ప్రసంగంలో లేకపోవడం ప్రశ్నార్థకంగా మారింది.

రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి ఏమిటి..❓ రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి ప్రస్తుతం అభివృద్ధి కోసం ఎదురుచూస్తోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయడానికి అధికారికంగా చర్యలు తీసుకున్నారు. ఆసుపత్రి భవన నిర్మాణానికి రూ.5.75 కోట్ల నిధులు కూడా అప్పటి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మంజూరు చేశారు. స్వయంగా వారే వచ్చి దానికి శంకుస్థాపన చేశారు. నేడు ఆసుపత్రి పరిస్థితి ఏమిటి? అభివృద్ధి పనులు ఎప్పుడు పూర్తి చేస్తారు? ప్రజలకు మెరుగైన వైద్యం ఎప్పుడు అందుతుంది ఇవన్నీ ముఖ్యమంత్రి నకిరేకల్ పర్యటన సందర్భంగా ప్రజలకు చెప్పాల్సిన అంశాలు. కానీ ఈ విషయాలపై కూడా సభలో స్పష్టమైన ప్రకటన లేకపోవడం బాధాకరం.

ముఖ్యమంత్రి నుండి నకిరేకల్ ప్రజలు ఆశించింది ఏంటి అంటే..❓ నకిరేకల్ ప్రజలకు రాజకీయ విమర్శలు అవసరం లేదు అభివృద్ధి కావాలి, సాగునీరు కావాలి, మంచి వైద్యం కావాలి, ప్రాజెక్టులు పూర్తి చేయాలి, కొత్త పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు కావాలి, మా ప్రాంతానికి నిధులు కావాలి. కేసీఆర్ హయాంలో మంజూరైన 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించడం మంచిదే. ప్రజలకు అది ఉపయోగపడాలి. నకిరేకల్‌కు వచ్చి బీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ను విమర్శించడం కాకుండా… నకిరేకల్ ప్రజలకు మీ ప్రభుత్వం కొత్తగా ఏం ఇచ్చింది? నకిరేకల్‌కు వచ్చిన ముఖ్యమంత్రి గారు… నకిరేకల్ కోసం ఏం ప్రకటించారు? దీనిపైన మీరు మా నకిరేకల్ ప్రజానికానికి సమాధానం చెప్పాలనీ డిమాండ్ చేస్తున్నాం.