బూడిద నుంచి పుడుతున్న అందాలు.. లాస్ ఏంజెల్స్ కార్చిచ్చుపై ‘సీడ్ బాంబు’ల యుద్ధం!
* 16 వేల ఇళ్లను బూడిద చేసిన మహా విపత్తు..
విషపూరితమైన నేలను మారుస్తున్న వైనం
* రచయిత్రి డానా గుడ్‌ఇయర్, ఆమె కుమారుడి వినూత్న ప్రాజెక్ట్..
పచ్చదనంతో ఊపిరి పోసుకుంటున్న నగరాలు!
హైదరాబాద్ న్యూస్‌టైమ్, అంతర్జాతీయ డెస్క్:
ఆ కాలిన గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి.. ఆ జ్ఞాపకాలు గుండెల్లో మంటలు రేపుతూనే ఉన్నాయి. 2025 జనవరి 7న అమెరికాలోని లాస్ ఏంజెల్స్ (LA), దాని పరిసర ప్రాంతాలను అతలాకుతలం చేసిన మహా కార్చిచ్చు ఏకంగా 16,000 పైగా ఇళ్లు, కట్టడాలను బూడిద కుప్పగా మార్చింది. ఆ విధ్వంసం సృష్టించిన శూన్యం నుంచి, తీవ్రమైన నష్టం నుంచి ఇప్పుడు సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ప్రముఖ రచయిత్రి, జర్నలిస్ట్ డానా గుడ్‌ఇయర్ (Dana Goodyear) తన 14 ఏళ్ల కుమారుడు రమ్మీతో కలిసి ప్రారంభించిన ‘ది సీడ్ బాంబ్ ప్రాజెక్ట్’ (The Seed Bomb Project) ఇప్పుడు కాలిపోయిన ఆ నగర గుండెల్లో పచ్చటి విప్లవాన్ని తీసుకువస్తోంది.
కార్చిచ్చు మిగిల్చిన విషానికి విరుగుడు!
కార్చిచ్చు కేవలం ఇళ్లను మాత్రమే కాల్చలేదు, ఆ మంటల్లో ఇళ్లలోని ప్లాస్టిక్, సీసం, పాదరసం వంటి ప్రమాదకర రసాయనాలు కరిగిపోయి అక్కడి నేలంతా అత్యంత విషపూరితంగా (Toxic) మారిపోయింది. ఈ విపత్తులో స్వయంగా ఇల్లు కోల్పోయిన డానా గుడ్‌ఇయర్ కుటుంబం.. కేవలం చేతులు ముడుచుకుని కూర్చోలేదు. వినాశనం జరిగిన చోటే అందమైన ప్రకృతిని మళ్లీ సృష్టించాలని సంకల్పించింది. మట్టి, సేంద్రీయ ఎరువుతో కలిపి స్థానిక అడవి పూల గింజలను (Native Seeds) చిన్న చిన్న ‘సీడ్ బాంబులు’గా తయారు చేసి, కాలిపోయిన కొండలు, మైదానాలపై చల్లడం ప్రారంభించారు.
మట్టిని శుద్ధి చేస్తున్న ప్రకృతి మాత!
ఈ ప్రాజెక్ట్ కేవలం అందం కోసమే కాదు, సైంటిఫిక్ గా కూడా అద్భుతాలు చేస్తోంది. ఇక్కడ చల్లుతున్న కాలిఫోర్నియా పాపీస్, సన్‌ఫ్లవర్స్ వంటి స్థానిక మొక్కలకు ఒక అద్భుతమైన గుణం ఉంది. ఇవి అగ్నిప్రమాదాల తర్వాత కూడా తట్టుకుని పెరగడమే కాకుండా.. వేర్ల ద్వారా నేలలోని విషపూరిత రసాయనాలను పీల్చుకుని భూమిని మళ్లీ సారవంతంగా, స్వచ్ఛంగా మారుస్తాయి. ‘మనం నిస్సహాయులుగా ఉండిపోవడం కంటే.. సహాయపడే చేతులుగా మారడమే మిన్న’ అంటూ యువతను, బాధితులను ఏకం చేస్తూ వేలాది సీడ్ బాంబులను చల్లుతున్న డానా గుడ్‌ఇయర్ ప్రయత్నం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. నాశనమైన చోటే నందనవనాన్ని సృష్టిస్తూ ఈ ప్రాజెక్ట్ మానవ సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తోంది.