బైక్ రేసింగ్ మృత్యుఘోష: మహబూబ్‌నగర్‌లో ఐదుగురు మృతి!
హైదరాబాద్ న్యూస్‌టైమ్ - మహబూబ్‌నగర్ ప్రతినిధి): యువకుల అతివేగం, బైక్ రేసింగ్ పిచ్చి ఐదు నిండు ప్రాణాలను గాలిలో కలిపేసింది. మహబూబ్‌నగర్ బైపాస్ రోడ్డులో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో పాటు ఇద్దరు యువకులు మృతి చెందారు. క్షణాల్లో జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా పెను విషాదాన్ని నింపింది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన యాకుబ్ అఫ్జల్ (25) తన స్పోర్ట్స్ బైక్‌పై మరో వ్యక్తితో కలిసి మహబూబ్‌నగర్ బైపాస్ రోడ్డులో సుమారు 140 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న కారును అతివేగంతో బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాద తీవ్రతకు కారులో ప్రయాణిస్తున్న అర్షియ బేగం (30), ఆమె పిల్లలు ఉజేప (7), అమర్ (2) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బైక్‌పై ఉన్న యాకుబ్ అఫ్జల్ తో పాటు అతని స్నేహితుడు కూడా మరణించారు.
పోలీసుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం: మహబూబ్‌నగర్ బైపాస్ రోడ్డు గత కొంతకాలంగా బైక్ రేసర్లకు అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రతి ఆదివారం యువకులు స్పోర్ట్స్ బైక్‌లతో ఇక్కడ ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తున్నా, పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే నేడు ముగ్గురు అమాయకులు, ఇద్దరు యువకులు బలైపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే రేసింగ్‌లను అరికట్టి, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.