బోరు బావిలో పడ్డ మనవడిని రక్షించబోయి.. తాత మృతి!

Published on: 16 May 2026, 06:11 AM
News Article
  • నాలుగేళ్ల చిన్నారిని కాపాడే క్రమంలో..
  • ఉప సర్పంచ్ వెంకన్న దుర్మరణం
  • సురక్షితంగా బయటపడ్డ పసికందు..
  • మిర్యాలగూడ ఊట్లపల్లిలో తీవ్ర విషాదం

హైదరాబాద్ న్యూస్ టైమ్, నల్గొండ/మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఊట్లపల్లి శివారులోని వ్యవసాయ పొలం వద్ద బోరు బావిలో పడ్డ నాలుగేళ్ల మనవడిని కాపాడబోయి, ఊపిరాడక తాత ప్రాణాలు కోల్పోయిన అత్యంత విషాదకర ఘటన శనివారం వెలుగుచూసింది. పొలంలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు తెరిచి ఉన్న బోరు గుంతలో పడిపోయిన పసికందును గమనించిన తాత, స్థానిక ఉప సర్పంచ్ వెంకన్న (53) ఎలాగైనా మనవడిని రక్షించాలనే తాపత్రయంతో ఆ గుంతలోకి దిగగా, దురదృష్టవశాత్తు ఆయనే అందులో గట్టిగా ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న మిర్యాలగూడ రూరల్ పోలీసులు తక్షణమే ఘటనాస్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి, అత్యంత శ్రమతో బోరు గుంతలోంచి తాత, మనవడిని బయటకు తీశారు. అయితే, లోపల గాలి ఆడకపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురైన వెంకన్నను అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన కన్నుమూశారు. పోలీసులు సకాలంలో స్పందించి రక్షించడంతో నాలుగేళ్ల బాలుడు సురక్షితంగా బయటపడగా, కళ్లముందే మనవడి ప్రాణాలు నిలిపి తాను అనంతలోకాలకు వెళ్లిన తాత వెంకన్న మృతితో ఆ గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.