భర్త ఫోన్ ఎత్తలేదని క్షణికావేశంలో వివాహిత ఆత్మహత్య..

Published on: 08 Sep 2026, 01:48 PM
News Article

మహబూబాబాద్, సెప్టెంబర్ 8, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భర్త ఫోన్ ఎత్తలేదన్న మనస్తాపంతో ఓ వివాహిత క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడింది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామానికి చెందిన అఖిల (20)కు రెండేళ్ల క్రితం మహబూబాబాద్‌లోని హౌసింగ్ ఫైనాన్స్ మేనేజర్ బాణోత్ హుస్సేన్‌తో వివాహం జరిగింది. వీరికి ఒక పాప ఉంది. ఇటీవల పుట్టింటికి వెళ్లిన అఖిల, పాప ఏడుస్తుండటంతో భర్తకు చూపించి మాట్లాడించేందుకు ఈ నెల 2న వీడియో కాల్ చేసింది. అయితే హుస్సేన్ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన అఖిల, వెంటనే మహబూబాబాద్‌లోని అత్తగారింటికి వచ్చి ఎలుకల మందు పేస్ట్ తిన్నది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.