భర్తను భోజనంలో నిద్రమాత్రలు కలిపి హతమార్చిన భార్య: ప్రియుడితో కలిసి దారుణం!
హైదరాబాద్, జూలై 08, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): మియాపూర్‌లో సంచలనం సృష్టించిన మల్లాని పెంటేష్ (52) హత్యోదంతం వెనుక విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అపార్ట్‌మెంట్ వ్యాపారి అయిన పెంటేష్‌ను, తన భార్య సత్యవతి (40) తన ప్రియుడు మధుసూదన్ రెడ్డితో కలిసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. శ్రీకాకుళానికి చెందిన సత్యవతి, తన వివాహిత విషయాన్ని దాచి పెంటేష్‌ను పెళ్లి చేసుకుంది. అదే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న నిజామాబాద్‌కు చెందిన మధుసూదన్ రెడ్డితో సత్యవతి వివాహేతర సంబంధం పెట్టుకోగా, విషయం తెలిసిన పెంటేష్ మధుసూదన్‌ను ఇల్లు ఖాళీ చేయించాడు. దీంతో పెంటేష్‌ను అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నిన సత్యవతి, గత ఏడాది నవంబర్ 19న పెంటేష్ భోజనంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. అతను స్పృహ కోల్పోయాక మధుసూదన్‌తో కలిసి దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. సాక్ష్యాలు దొరకకుండా మృతదేహాన్ని కారులో మహారాష్ట్రలోని తుల్జాపూర్ తీసుకెళ్లి దహనం చేశారు. అక్కడ మృతదేహం పాక్షికంగా కాలడంతో స్థానిక పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయగా, ఇక్కడ సత్యవతి తన భర్త కనిపించడంలేదని నాటకమాడుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులు దర్యాప్తులో పెంటేష్ ఆచూకీ దొరకకపోవడం, సత్యవతి ప్రవర్తనపై అనుమానం వచ్చిన బంధువుల సమాచారంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయటపడింది. నిందితులిద్దరూ తామే హత్య చేసినట్లు అంగీకరించడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.