భార్యను చంపించి సినీ ఫక్కీలో నాటకమాడిన భర్త

Published on: 10 Jun 2026, 04:21 AM
News Article

హైదరాబాద్ న్యూస్‌టైమ్, హైదరాబాద్, జూన్ 10, 2026: భార్యతో ఉన్న వివాదాల నేపథ్యంలో సుపారీ గ్యాంగ్‌తో ఆమెను దారుణంగా హత్య చేయించి, ఏమీ ఎరగనట్లు సినీ ఫక్కీలో నాటకమాడిన భర్త బండారాన్ని పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పరిధిలో జరిగిన ఈ మహిళ హత్య కేసు వివరాల్లోకి వెళితే, బీహార్ రాష్ట్రం నుండి బతుకు దెరువు కోసం వలస వచ్చిన అనిల్ కుమార్, మీనాదేవి (35) దంపతులు ఇక్కడే నివాసం ఉంటున్నారు. అయితే, గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య తీవ్రమైన గొడవలు జరుగుతుండటంతో, భార్యను ఎలాగైనా వదిలించుకోవాలని భావించిన అనిల్ కుమార్ ఆమెను హతమార్చేందుకు బీహార్ నుండి నలుగురు సభ్యుల సుపారీ గ్యాంగ్‌ను ఇక్కడికి పిలిపించాడు. ఇందులో భాగంగా మే 30వ తేదీ సాయంత్రం దంపతులిద్దరు కూరగాయలు కొనేందుకు సంతకు వెళ్లి తిరిగి వస్తుండగా, ఒక నిర్మానుష్య ప్రాంతంలో తమ ద్విచక్ర వాహనం పాడైపోయినట్లు అనిల్ కుమార్ నాటకమాడి రిపేర్ చేయడం ప్రారంభించాడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న సుపారీ గ్యాంగ్ సభ్యులు మీనాదేవిని బలవంతంగా పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లి గొంతుకోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై మొదట భర్త అనిల్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, అతడి ప్రవర్తనపై అనుమానం వ్యక్తమైంది. ముఖ్యంగా అనిల్ కుమార్ ఒంటిపై ఉన్న కత్తి గాట్లు కల్పితంగా ఉన్నాయని గ్రహించిన పోలీసులు, హత్య జరిగిన సమయంలో కూరగాయల సంచి భార్య చేతిలోనే ఉందని అతడు చెప్పినప్పటికీ సంఘటనా స్థలంలో కూరగాయలు కిందపడి చెల్లాచెదురు కాకపోవడాన్ని కీలక క్లూగా గుర్తించారు. దీంతో అనుమానం వచ్చి అనిల్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా, సుపారీ గ్యాంగ్‌ను పురమాయించి తానే ఈ హత్య చేయించినట్లు అతడు ఒప్పుకున్నాడు. ఈ కేసులో నిందితుడైన భర్తతో పాటు సుపారీ గ్యాంగ్‌కు చెందిన ఒక నిందితుడిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న మిగతా ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.