భార్యను హత్య చేసి పొదల్లో పడేసిన భర్త అరెస్ట్..
ఆకివీడు, ఆగస్ట్ 25, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో కలకలం రేపిన మహిళ హత్యోదంతం కేసును పోలీసులు ఛేదించారు. భార్యను హత్య చేసి ఉప్పటేరు సమీపంలోని పొదల్లో పడేసిన భర్త నారాయణరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 15న ఆకివీడు ఉప్పుటేరు వద్ద లభ్యమైన అజ్ఞాత మహిళ మృతదేహంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతురాలి ఎడమ కాలికి ఉన్న సర్జికల్ స్టీల్ ప్లేట్, స్క్రూ ఆధారంగా ఆరా తీయగా, ఆమె ఉప్పాడ దేవిగా గుర్తింపు లభించింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త నారాయణరావే భీమవరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో దేవిని గొంతు నులిమి హత్య చేసి, ఆనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ఆకివీడు సమీపంలోని ఉప్పుటేరు వద్ద పడేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.