హైదరాబాద్, నవంబర్ 21, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): తెలంగాణలో భూ రికార్డుల నిర్వహణ కోసం తీసుకొచ్చిన 'భూ భారతి' పోర్టల్ భద్రతపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా రికార్డుల్లో యజమానుల పేర్లు మార్చి, ఓ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భూమినే కబ్జా చేసేందుకు దుండగులు యత్నించిన సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. భూ భారతి వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి ఈ కుంభకోణానికి పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తుండగా, దీని వెనుక రెవెన్యూ అధికారుల సహకారం కూడా ఉందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రిటైర్డ్ అధికారులు, ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు), స్థానికంగా నివసించని వారి భూములనే లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా భారీ దోపిడీకి పాల్పడింది.
అసైన్డ్ భూమి సర్వేతో బయటపడిన అసలు బండారం: సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం సంగుపేట పరిధిలో సర్వే నంబర్ 329/2లో ఉన్న 4.27 ఎకరాల వ్యవసాయ భూమిని మాజీ ఐపీఎస్ అధికారి ఈశ్ కుమార్ 18 ఏళ్ల క్రితం కొనుగోలు చేసి తన ఆధీనంలో ఉంచుకున్నారు. అయితే, ఇటీవలే ఆయన భూమి పక్కన ఓ వ్యక్తి ఫంక్షన్ హాల్ నిర్మిస్తూ, అందుకోసం పక్కనే ఉన్న అసైన్డ్ భూమిని కబ్జా చేస్తున్నాడని స్థానిక రైతులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి అసైన్డ్ భూమి హద్దులు నిర్ధారించారు. ఆ సమయంలో పక్కనే ఉన్న 4.27 ఎకరాల భూమి 'మీర్ మురాద్ అలీ' పేరు మీద రికార్డుల్లో నమోదై ఉండటాన్ని గమనించిన అధికారులు, అసలు అతనెవరు అని స్థానిక రైతులను ఆరా తీశారు. దీంతో ఆ భూమి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఈశ్ కుమార్‌దని, వేరే వ్యక్తి పేరు మీదకు ఎలా మారిందో అర్థం కావడం లేదని రైతులు ఆశ్చర్యపోయారు.
13 జిల్లాల్లో భారీ కుంభకోణం.. తొమ్మిది మంది అరెస్ట్: విషయం తెలుసుకున్న మాజీ ఐపీఎస్ అధికారి ఈశ్ కుమార్ వెంటనే రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో, విచారణ చేపట్టిన సీఐడీ అధికారులు విస్తుపోయే నిజాలను బయటపెట్టారు. కేవలం ఈశ్ కుమార్ భూమి మాత్రమే కాకుండా, మీర్ మురాద్ అలీ పేరిట సంగారెడ్డిలో మరో 28 గుంటలు, కొల్లూరులో 4 ఎకరాలతో పాటు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఇదే తరహాలో అనేక భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ అయినట్లు సీఐడీ గుర్తించింది. ఈ కుంభకోణానికి పాల్పడిన తొమ్మిది మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం రెవెన్యూ అధికారులు ఈశ్ కుమార్‌కు చెందిన 4.27 ఎకరాలతో పాటు ముఠా కాజేసిన మిగతా భూములను తిరిగి అసలైన యజమానుల పేరిట మార్చారు.
సామాన్యుల పరిస్థితి ఏంటంటూ విమర్శలు: కేవలం వెబ్‌సైట్ హ్యాక్ చేయడం వల్ల ఇంత పెద్ద స్థాయిలో కుట్ర జరిగే అవకాశం లేదని, కచ్చితంగా రెవెన్యూ అధికారుల ప్రమేయం ఉండి ఉంటుందని సీఐడీ అనుమానిస్తోంది. మరోవైపు, బాధితుడు ఈశ్ కుమార్ ఉన్నత స్థాయిలో పరిచయాలు ఉన్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కావడంతో ఫిర్యాదు చేసిన వెంటనే సమస్య పరిష్కారమైందని, మరి సామాన్య ప్రజల భూములు ఇదే తరహాలో అన్యాక్రాంతమైతే వారికి రక్షణ దొరుకుతుందా అంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.