నిర్మల్, అక్టోబర్ 1, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీజీఎస్ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని డిపోతో పాటు భైంసా డిపోలో గురువారం సాయంత్రం సుమారు 7 గంటలకు ఆర్టీసీ జేఏసీ కూటమి చైర్మన్ ఈదురు వెంకన్న ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర జేఏసీ కూటమి చైర్మన్ ఈదురు వెంకన్నతో పాటు టీఎంయూ రాష్ట్ర అధ్యక్షులు ఏ.ఆర్. రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిర్మల్, భైంసా డిపోలకు విచ్చేసిన జేఏసీ కూటమి చైర్మన్ ఈదురు వెంకన్న, ఏ.ఆర్. రెడ్డిలకు స్థానిక కార్మికులు, నాయకులు పూలగుచ్చాలు అందజేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం డిపోల పరిధిలోని కార్మికులను కలిసి ఎన్నికల అంశాలపై, కార్మికుల సంక్షేమంపై ప్రసంగించారు.
మేనిఫెస్టో ముఖ్యాంశాలు: ఈ సందర్భంగా రాష్ట్ర జేఏసీ కూటమి చైర్మన్ ఈదురు వెంకన్న మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల కోసం నూతన మేనిఫెస్టోను రూపొందించినట్లు తెలిపారు. ఇందులో ప్రధానంగా విశ్రాంత ఉద్యోగులకు సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో ఉచిత/సబ్సిడీ ప్రయాణ సౌకర్యం కల్పించాలని, ఉద్యోగి తల్లిదండ్రులు లేదా అత్తమామలకు ప్రముఖ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. అలాగే మహిళా ఉద్యోగుల ప్రసూతి (మాటర్నిటీ) సెలవులను 240 రోజులకు పెంచాలని, ప్రైవేట్ అద్దె బస్సుల సంఖ్యను క్రమంగా తగ్గిస్తూ ఆర్టీసీ సొంత బస్సుల సంఖ్యను పెంచాలని పేర్కొన్నారు. ఇలాంటి సుమారు 40 ముఖ్యమైన అంశాలతో మేనిఫెస్టో రూపొందించామని, ప్రతి కార్మికుడికి అవసరమైన సదుపాయాలను చేకూరుస్తూ ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు సర్వవిధాలా కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీఎంయూ రాష్ట్ర అధ్యక్షులు ఏ.ఆర్. రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో త్వరలో జరగబోయే టీజీఎస్ ఆర్టీసీ ఎన్నికల్లో కార్మికులందరూ అత్యంత ఐక్యమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, కార్మికుల హక్కుల సాధన కోసం ఐక్యతతో ఉండి జేఏసీ కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.