మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డిలపై చర్యలకు రంగం సిద్ధం

Published on: 25 Aug 2026, 05:41 AM
News Article

హైదరాబాద్, ఆగస్ట్ 25, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలు మరియు పార్టీ వ్యతిరేక ధోరణిని ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మరియు సీనియర్ నేత జి. చిన్నారెడ్డిలపై చర్యలు తీసుకోవాలని పీసీసీ క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ (DAC) నిర్ణయించింది. ఈ మేరకు సమగ్ర నివేదికను సిద్ధం చేసిన కమిటీ, మంగళవారం పీసీసీ మరియు ఏఐసీసీ (AICC) పెద్దలకు సమర్పించనుంది. వ్యక్తులు ఎంతటి వారైనా పార్టీ కంటే ఎవరూ పెద్దకాదని, తప్పు చేసిన వారిని ఉపేక్షిస్తే పార్టీ కేడర్‌కు, ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని కమిటీ గట్టిగా భావిస్తోంది. మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బాధ్యతాయుతమైన మంత్రిగా సురేఖ ఖండించకపోవడాన్ని కమిటీ తీవ్రంగా పరిగణించింది. ఆమె ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందనందున, క్రమశిక్షణ ఉల్లంఘన కింద వీరిద్దరిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆ నివేదికలో స్పష్టంగా సిఫార్సు చేసినట్లు సమాచారం. ఈ నివేదిక ఆధారంగా పార్టీ అధిష్టానం త్వరలోనే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.