మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా?

Published on: 03 Sep 2026, 07:06 AM
News Article

హైదరాబాద్, సెప్టెంబర్ 3, 2026 (హైదరాబాద్ న్యూస్‌టైమ్): తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో మంత్రి కొండా సురేఖ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. అధిష్టానమే స్వయంగా తనను బర్తరఫ్ చేసే కంటే.. ఆ పరిస్థితి వచ్చే ముందే తానే స్వయంగా రాజీనామా ప్రకటించాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం.

ఈ పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖ దంపతులు తమ అనుచరులు, శ్రేయోభిలాషులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. మంత్రి పదవితో పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా వద్దా అనే కీలక అంశంపై వారు తీవ్రంగా చర్చిస్తున్నారు. అనుచరుల అభిప్రాయాలు సేకరించిన అనంతరం, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కొండా దంపతులు నేరుగా మీడియా ముందుకు వచ్చి తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం తీరుపై వారు ఏ విధమైన వ్యాఖ్యలు చేస్తారు, పార్టీ వీడే సాహసోపేత నిర్ణయం తీసుకుంటారా అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.