మంత్రి పొంగులేటి సమీక్షకు ఎమ్మెల్సీ పోచంపల్లి 'షాక్'..
- రాజకీయ దురుద్దేశంతోనే నిధుల నిలిపివేత..
- ఇంకా 50 శాతం బకాయిలు రావాల్సిందే
- సమీక్షా సమావేశానికి డుమ్మా..
- నిధుల మంజూరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నిరసన
హైదరాబాద్ న్యూస్ టైమ్, హైదరాబాద్: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఘాటైన లేఖ రాస్తూ నేడు హైదరాబాద్‌లో నిర్వహించనున్న కీలక సమీక్షా సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం రాజకీయంగా కలకలం రేపుతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తన నియోజకవర్గానికి మంజూరు కావాల్సిన అభివృద్ధి నిధుల విషయంలో ప్రభుత్వం వివక్ష చూపుతోందని, అవసరమైన నిధులలో కేవలం 50 శాతం మాత్రమే మంజూరు చేసి మిగతా నిధులను ఉద్దేశపూర్వకంగానే తొక్కిపెట్టారని ఆయన లేఖలో ఆరోపించారు. బకాయి నిధులపై ఎన్నిసార్లు విన్నవించినా రాజకీయ దురుద్దేశంతోనే మంజూరు చేయడం లేదని మండిపడ్డ ఆయన, అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వకుండా నిర్వహించే సమీక్షా సమావేశాలకు హాజరు కావడంలో అర్థం లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలో జరగనున్న రెవెన్యూ, హౌసింగ్ సమీక్షకు తాను హాజరు కావడం లేదని బహిరంగంగా ప్రకటించి ప్రభుత్వంపై తన నిరసనను వ్యక్తం చేశారు.