మనస్తాపంతో సీఏ విద్యార్థి ఆత్మహత్య
- 'సీఏ చదవడం నా వల్ల కాదు..
- క్షమించండి' అంటూ తల్లిదండ్రులకు లేఖ
హైదరాబాద్ న్యూస్ టైమ్, మియాపూర్ (హైదరాబాద్): నగరంలోని మియాపూర్ గోకుల్ ప్లాట్స్‌లో చదువుల ఒత్తిడి, బ్యాక్‌లాగ్‌లు ఉన్నాయనే మనస్తాపంతో ఓ సీఏ (CA) విద్యార్థి అత్యంత దారుణమైన రీతిలో ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆంజనేయులు కుమారుడు జనార్ధన్ (28) చెన్నైలో సీఏ ఫైనల్ ఇయర్ చదువుతుండగా, ఫెయిల్ అయిన రెండు సబ్జెక్టుల పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు హైదరాబాద్ వచ్చి స్నేహితులతో కలిసి రూమ్‌లో ఉంటున్నాడు. అయితే, ఇటీవల జరిగిన పరీక్షలకు హాజరుకాని జనార్ధన్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై, స్నేహితులంతా ఉద్యోగాలకు వెళ్లిన సమయంలో రూములో ఒంటరిగా ఉంటూ దారుణంగా తన నాలుక కోసుకుని, ఆపై ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సాయంత్రం ఉద్యోగాల నుండి తిరిగి వచ్చిన స్నేహితులు తలుపులు పగలగొట్టి చూడగా గదిలో రక్తపు మడుగులో ఉరి వేసుకుని కనిపించిన జనార్ధన్ మృతదేహాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, అక్కడ లభ్యమైన రెండు సూసైడ్ నోట్లలో "సీఏ కోర్స్ చదవడం నా వల్ల కావడం లేదు.. నన్ను క్షమించండి" అని తల్లిదండ్రులను ఉద్దేశించి రాసి ఉన్నట్లు గుర్తించి, పరీక్షల భయంతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు నిర్ధారించారు.